హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ కార్మికుల కు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎం యూ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆర్టీసీ జాక్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇచ్చిన యూనియన్లతోపాటు, ఆర్టీసీ యాజమాన్యం సోమవారం చర్చలకు రావాలని కార్మిక శాఖ ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో టీఎంయూ రాష్ట్ర కార్యవర్గ స మావేశం జరిగింది. ఈ సందర్భంగా టీఎం యూ అధ్యక్షుడు ఏ రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం థామస్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ కమలాకర్‌గౌడ్, ముఖ్య సలహాదారులు ఎల్ మారయ్య, బీ యాదయ్య మాట్లాడుతూ.. సోమవారం జరిగే చర్చల్లో కార్మికుల కు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే స మ్మెకు దిగడం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తిచేయడంతోపాటు 2017, 2021 వేతన సవరణ బ కాయిలను వెంటనే విడుదల చేయాలని డి మాండ్ చేశారు. ఆర్టీసీలో కార్మికులపై అధికారుల వేధింపులు తీవ్రమయ్యాయని, పని ఒ త్తిడి వల్ల ఎంతో మంది కార్మికులు విధులలోనే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు వచ్చే పీఆర్సీ పరిధిలోకి చేరుస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పిస్తామని, ఆర్టీసీ బస్సులను ఆధునీకరిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు.
ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్ర: థామస్‌రెడ్డి
ఆర్టీసీలో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి, వాటి నిర్వహణ కోసం డిపోలను కేటాయిస్తున్నారని, తద్వారా ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని థామస్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్టీసీని కాపాడుకోవడంతోపాటు పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలన్న సంకల్పంతో మెజార్టీ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమాలు చేపట్టినా ప్రభుత్వం చలించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నాలు
టీఎంయూ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చెసిన అశ్వత్థామరెడ్డి లాంటి కొందరు స్వార్థపరులు ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని థామస్‌రెడ్డి విమర్శించారు. టీఎంయూ నిధులను దుర్వినియో గం చేసిన అశ్వత్థామరెడ్డి ప్రస్తుతం ఏ యూనియన్‌లో లేరని స్పష్టం చేశారు.
సజ్జనార్ వచ్చాకే సమస్యలు..
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చాకే కార్మికులకు సమస్యలు పెరిగాయని థామస్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన హయాంలో 2022 నుంచి ఇప్పటివరకు ఎంత మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారో, ఎంత మంది ఉద్యోగాలు కోల్పోయారో లెక్కచెప్పాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్, కన్సల్టెన్సీ పేరుతో ఆర్టీసీ సొమ్మును దుబారా చేసిన సజ్జనార్.. కొన్ని రకాల చికిత్సల కోసం తార్నాక ఆర్టీసీ దవాఖానకు వస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న వియషం నిజం కాదా? అని ప్రశ్నించారు. సజ్జనార్ అక్రమాలపై చట్టపరంగా విచారణ జరిపించి, ఆర్టీసీని కాపాడుకోవాలనే లక్ష్యంతోనే సమ్మె బాట పట్టినట్టు తెలిపారు.
చర్చలు విఫలమైతే సమ్మె తేదీలు ఖరారు చేస్తాం: ఆర్టీసీ జేఏసీ
సమ్మె నోటీసులో ప్రస్తావించిన అన్ని డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు మధ్య చర్చలు జరుగనున్న నేపథ్యంలో ఆదివారం జేఏసీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఈ వెంకన్న, ఎం థామస్‌రెడ్డి, యాదయ్య, మౌలానా, కమలాకర్‌గౌడ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ యాజమాన్యంతో జరిగే చర్చల ఫలితాల ఆధారంగా సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ చర్చలు విఫలమైతే సమ్మె తేదీలు ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.