హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నేతలు కోరారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలోని 14వ అంశంగా పేర్కొన్న ఆర్టీసీ సమస్యల గురించి మంత్రికి మరోసారి గుర్తుచేశారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి చొరవచూపి, సీఎం వద్దకు తీసుకెళ్లాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కార్మికులతో కలిసి అన్ని విషయాలు చర్చిస్తానని శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేస్తామని, రెండు పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తామని ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని ప్ర శ్నించారు. అసెంబ్లీలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని స్వయంగా కలుసుకొని కార్మికుల సమస్యలపై చర్చించడానికి అపాయింట్మెంట్ కోరుతూ సచివాలయంలో లేఖ ఇచ్చారు.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు కొత్త పీఆర్సీని నియమించాలని తెలంగాణ విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం టీజీ జెన్కో సీఎండీ హరీశ్‌ను కలిసి జేఏసీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెంచిన వేతనాలు చెల్లించాలని, సమస్యల సాధనకు 1999- 2004 మధ్య నియమితులైన వారికి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే అపరిమిత మెడికల్ సౌకర్యం కల్పించడంతో పాటు ఆర్టిజన్ ఉద్యోగులకు విద్యార్హతలను బట్టి సర్వీస్‌రూల్స్‌ను వర్తింపజేసి ఉద్యోగోన్నతులు కల్పించాలని వేడుకున్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో చైర్మన్ కోడెపాక కుమారస్వామి, కన్వీనర్ ముత్యం వెంకన్నగౌడ్, కో చైర్మన్ ఆర్ సుధాకర్‌రెడ్డి, కో కన్వీనర్ సీ భానుప్రకాశ్ తదితరులు ఉన్నారు.