హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తేతెలంగాణ) : ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు అద్దె బస్సుల పేరుతో ప్రభుత్వం, యాజమాన్యం కుట్ర చేస్తున్నదని ఆర్టీసీ జేఏసీ నేతలు విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం చలో బస్‌భవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి సంవత్సరం గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరిస్తామని చెప్పి మరిచిపోయిందని తెలిపారు. ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ బాబు మాట్లాడుతూ మోటార్ వెహికిల్ ట్యాక్స్‌ల భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో ఆర్టీసీ డ్రైవర్ల సంఖ్యను పెంచితే తెలంగాణలో మాత్రం కుదిస్తున్నారని పేర్కొన్నారు.
ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి ఎస్ బాల్‌రాజ్ మాట్లాడుతూ కేంద్రం 44 చట్టాలను తీసేసి 4 కోడ్లుగా విభజించడాన్ని తప్పుపట్టారు. ఆర్టీసీలో 12 నుంచి 16 గంటలపాటు డ్యూటీ చేయిస్తూ యాజమాన్యం కార్మిక శ్రమశక్తిని దోచుకుంటున్నదని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొని ఆర్టీసీకి సరఫరా చేయాలని కన్వీనర్ మౌలానా పేర్కొన్నారు. డ్రైవర్, కండక్టర్, మెకానికల్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కో-కన్వీనర్ కత్తుల యాదయ్య కోరారు. మహాలక్ష్మి పథకంలో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ బదులు స్మార్ట్ కార్డు ఇవ్వాలని సుద్దాల సురేశ్ తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు కమలాకర్‌రెడ్డి, బీ యాదగిరి, వివిధ జిల్లాల ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.