TGSRTC | హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగులపై యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిపై ఆర్టీసీ జేఏసీ మండిపడుతున్నది. ఆర్పీఎస్ -2013 బాండ్ల బకాయిల చెల్లింపులో ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న పద్ధతిపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం ఆర్పీఎస్ 2013 బాండ్లకు సంబంధించి రూ.280 కోట్ల బకాయి పడింది. వీటిలో రూ.80 కోట్లను కేవలం డ్రైవర్లకు మాత్రమే చెల్లించింది.
మిగితా రూ.200 కోట్ల బాండ్ల బకాయిలను చెల్లించాలని ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఆగస్టు 27న రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేపట్టారు. ఈ నెల 10న డిమాండ్స్ డేకి పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులను శాంతింపచేసేందుకు గురువారం సుమారు 12వేల నుంచి 15 వేల మంది కండక్లర్లకు సుమారు రూ. 50కోట్ల నుంచి రూ. 80 కోట్ల బాండ్ల బకాయిలను యాజమాన్యం విడుదల చేసింది.
దీనిపై ఆర్టీసీ జేఏసీ హర్షం వ్యక్తం చేస్తూనే..మిగితా కేటగిరి వాళ్లకు ఎప్పుడు చెల్లిస్తారని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పూర్తిగా పరిష్కరించే వరకు ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఇదురు వెంకన్న స్పష్టం చేశారు. ఆర్టీసీ యాజమాన్య వైఖరి వలన బాండ్ డబ్బులు రాని వారిలో ప్రభుత్వంపైన వ్వతిరేకత పెరుగుతుందని చెప్పారు. వినాయక చవితి పండుగలోపు 2013 వేతన సవరణ బాండ్స్ బకాయి డబ్బులు చెల్లించాలని టీజీఎస్ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూయూ ఐఎన్టీయూసీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కొమిరెడ్డి రాజిరెడ్డి ఆర్టీసి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యలు వంద ఉంటే ఒకటీ అర పరిష్కారమైతే ఎలా? ఆర్టీసీ యాజమాన్యం విభజించి పాలిస్తున్నది. ఈ విషయాన్ని కార్మికులు గుర్తించాలి. ట్రేడ్ యూనియన్లు లేకుండా చేసి కార్మికులను హింసిస్తున్నారు. ఆర్టీసీ ఎండీ ట్రేడ్ యూనియన్లను గుర్తించడం లేదు.
– యాదయ్య ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐఎన్టీయూసీ ప్రతినిధి
అప్పుడు డ్రైవర్లు.. ఇప్పుడు కండక్టర్లకు బకాయిలు చెల్లించి కార్మికుల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు పీ కమాలాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం థామస్‌రెడ్డి, కార్యనిర్వహణ అధ్యక్షుడు మర్రి నరేందర్ అన్నారు. సంస్థలో కేటగిరీల వారిగా చెల్లింపులు చేయడం వలన కార్మికులలో వేర్పాటువాదానికి దారితీస్తుందని హెచ్చరించారు. శ్రామిక శక్తి నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎండీ ఇష్టారీతిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని కార్మికులను ఆందోళనలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం, ప్రభుత్వ అధినేతలు ఆర్టీసీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని టీఎంయూ ప్రతినిధులు కోరుతున్నారు.