హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఇప్పుడు పోరాటాన్ని మరింత ఉదృతం చేసింది. తమ ఉద్యమాన్ని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలను సమర్పించనున్నది. జిల్లాస్థాయిలో ఆర్టీసీ జేఏసీలు కలెక్టర్లకు వినతిపత్రం అందజేయనుండగా.. హైదరాబాద్‌లో రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని, 2021 వేతన సవరణ అమలు తదితర హామీలను నెరవేర్చాలని జేఏసీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ డిమాండ్లను పలుసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోవడంతో, తాజాగా వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించింది. అయినా స్పందించకపోతే తమ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. ఆర్టీసీని అభివృద్ధి చేయని ప్రభుత్వం.. ప్రైవేటు బస్సులను ప్రోత్సహిస్తున్నదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా కార్మికులకు ఉద్యోగ భద్రతపై బెంగపట్టుకున్నదని తెలిపారు.