హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికుల సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈ వెంకన్న ఆరోపించారు. సమ్మె చేయడానికి తేదీని ప్రకటించిన నేపథ్యంలో కార్మికులను సమాయత్తపరిచేందు కు డిపోలవారీగా సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులు సమావేశాలకు హాజరుకావద్దని అధికారులు ఫోన్లుచేసి బెదిరిస్తున్నారని తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సమ్మె తేదీ సమీపిస్తున్నందున కార్మికులను విచ్ఛిన్నం చేయాలని చర్చల పేరుతో కార్మికశాఖను ప్రభుత్వం రంగంలోకి దిం పిందని పేర్కొన్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఎన్నికల కోడ్ పేరుతో చర్చలకు రాకపోవడంతో కార్మికశాఖ చర్చలను వాయిదా వే సిందని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సీఈసీని కలిసి ఎన్నికల కోడ్ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల మధ్య విభేదాలు సృష్టించాలని ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు శిక్షణ పేరుతో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిందని ఆక్షేపించారు. సమ్మె విచ్ఛిన్నం కోసమే వారాంతపు సెలవుల్లో ఉన్న సిబ్బందికి కూడా శిక్షణ ఏర్పాటు చేశారని ఆరోపించారు. సమావేశంలో వైస్ చైర్మన్ ఎన్ థామస్‌రెడ్డి, కో కన్వీనర్లు పాల్గొన్నారు.