హైదరాబాద్, జనవరి 23 (నమస్తేతెలంగాణ) : ఈ నెల 27న ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్ బస్‌భవన్‌కు తరలిరావాలని టీజీఎస్ ఆర్టీసీ జాక్ రాష్ట్ర ప్రతినిధులు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో గురువారం ఆర్టీసీ జాక్ చైర్మన్ ఈ వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, బీయాదగిరి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల డిమాండ్ల సాధనకై ఆర్టీసీ జాక్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యా హ్నం 3 గంటలకు బస్‌భవన్ ఎదుట హాజరైన కార్మికులతో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని, అనంతరం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు సమ్మె నోటీస్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సులపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నదని, వాస్తవాలు తెలియాలంటే కార్మిక సంఘాలతో బహిరంగ చర్చ పెట్టాలని వారు డిమాండ్ చేశారు. వాటి రాకతో ఆర్టీసీ ఉద్యోగాలు కనుమరుగవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. యాజమాన్యం ఇచ్చిన వివరణ పచ్చి బూటకమని పేర్కొన్నారు.
టీజీఎస్ఆర్టీసీలో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులు, ఇతర సమస్యలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌పై విచారణ జరిపిస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కమాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ అధికారులు బయటకు చెప్పే విషయాలు ఒక విధంగా ఉంటే, వాస్తవాలు వాటికి భిన్నంగా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్టీసీ లాభాల్లో నడుస్తుందని చెప్పుకుంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. పెండింగ్ బకాయిలను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. 2017 నుంచి రిటైర్డ్ కార్మికులకు ఒక రూపాయీ ఇప్పటికీ ఇవ్వలేదని పేర్కొన్నారు. కానీ ఎండీ సజ్జనార్ మాత్రం మరోలా చెప్తున్నారని విమర్శించారు. ఆర్టీసీలో పోలీస్ అధికారి మాదిరిగా వ్యవహరిస్తూ కార్మికుల న్యాయమైన హక్కులను కాలరాస్తూ, ఆర్టీసీ ఉద్యోగులను వేధిస్తున్నారని కమాల్‌రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): సిబ్బంది తీరుతో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగం అభాసుపాలవుతున్నది. సచివాలయంలో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది వరుస వివాదాల్లో చిక్కుకుంటూ చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల ఓ ఎమ్మెల్యేను గుర్తుపట్టకుండా అడ్డుకున్న ఘటన మరువకముందే.. మొన్న సచివాలయంలోకి వెళ్లే విలేకరులను అడ్డుకొని నానా యాగి చేశారు. తాజాగా గురువారం వీవీఐపీ లిఫ్ట్‌లో వెళ్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో సిబ్బందిపై ఆ అధికారి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీరు డ్యూటీ పర్పస్ వెళ్తున్నారా’ అని ఆరా తీశారు. దీంతో కంగుతున్న సిబ్బంది లిఫ్ట్ దిగి వెనకి వెళ్లే ప్రయత్నం చేయగా, పేర్లు, పీసీ నంబర్ అడగటంతో విజిటర్స్ వెనకి వెళ్లి దాకునే ప్రయత్నం చేశారు. వెంటనే వారిని పిలిచి ‘మీ ఆఫీసర్‌కి చెప్పాలా? ఇదేనా డ్యూటీ చేసే పద్ధతి?’.. ‘డోంట్ యూజ్ వీవీఐపీ లిఫ్ట్ ఫర్ యువర్ పర్సనల్ వర్స్’ అంటూ ఘాటుగా మందలించి వెళ్లిపోయారు.