హైదరాబాద్ : నగరంలోని బస్ భవన్ ఏ బ్లాక్ ( Bus Bhavan Block ) ను బలవంతంగా ఆక్రమించుకున్న ఇన్‌కం ట్యాక్స్, జీఎస్టీ ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ ఈనెల 7న బస్ భవన్ బచావోకు టీజీఆర్టీసీ జేఏసీ ( RTC JAC ) పిలుపునిచ్చింది.
రాష్ట్రం విభజన తరువాత బస్ భవన్‌లోని ఏ బ్లాక్‌ను ఆంధ్రప్రదేశ్‌కు, బీ బ్లాక్‌ను తెలంగాణకు కేటాయించి కార్యకలాపాలు నిర్వహించిందని నాయకులు వెల్లడించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మార్చి 31 న బస్ భవన్‌కు చెందిన బి బ్లాక్ కార్యాలయాన్ని జీఎస్టీ శాఖకు, ఇన్‌కం ట్యాక్స్ శాఖకు ఏకపక్షంగా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.
అందులో భాగంగా జీఎస్టీ , ఇన్‌కం ట్యాక్స్ ఉన్నతాధికారులు మూకుమ్మడిగా బస్ భవన్‌కు చేరుకుని ఏ బ్లాక్ గేటుకు వేసి ఉన్న తాళాలను పగులగొట్టి కార్యాలయాన్ని ఆక్రమించుకోవడాన్ని జేసీ తీవ్రంగా ఖండించింది. వెంటనే ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేసి ఆర్టీసీ బస్ భవన్ ఎ-బ్లాక్ కార్యాలయాన్ని వెంటనే ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు.
షెడ్యూల్-9 లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తుల పంపకాలు నేటివరకు పూర్తి కానప్పటికీ , ఆర్టీసీఉమ్మడి ఆస్తులపై విధాన పరమైన నిర్ణయాలు ఇంకా జరుగలేదని గుర్తు చేశారు. కార్పొరేషన్ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేనప్పటికీ అధికార బలంతో ఏకపక్షంగా ఆర్టీసీ కార్యాలయాన్ని స్వాధీన పరచుకోవడం సమంజసం కాదని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి.మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి.యాదగిరి పేర్కొన్నారు.
ఆర్టీసీ ఆస్తులను అన్యాక్రాంతం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికి నిరసనగా ఈనెల 7న బస్ భవన్ బచావోకు తరలిరావాలని కోరారు. కార్యక్రమానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోని డిపోలలో గేటు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ కోశాధికారి బి.యాదయ్య, జె.రాఘవులు, ఎన్.కమలాకర్ గౌడ్, డి.గోపాల్, బుద్ధ విశాల్, నగేష్ పటేల్, రాం చందర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.