హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రత్యేక బస్సుల పేరుతో టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ దోపిడీకి తెరతీసింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులకు లేకుండా స్పెషల్ బస్సులను అందుబాటులోకి తెచ్చామని ఒకవైపు చెబుతూనే.. మరోవైపు అదనపు చార్జీలతో మోత మోగించింది. దీంతో సాధారణ సమయాల్లో ఉండే రేట్లే అనుకొని బస్సెక్కే ప్రయాణికులు టికెట్ ధరలను చూసి అవాక్కవుతున్నారు. ఎంతో ఆనందంగా పండుగకు సొంతూళ్లకు వెళ్దామనుకుంటే ఇలా అదనపు చార్జీలు పెంచడం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈసారి దూరంతో సంబంధం లేకుండా ప్రత్యేక బస్సుల్లో ఏకంగా 50% టిక్కెట్ల ధరలను పెంచారు. దీంతో ఉప్పల్ నుంచి తొర్రూర్‌కు సూపల్ లగ్జరీ టికెట్ ధర నిరుడు రూ.300వరకు ఉండగా.. 50% అదనపు పెంపుతో రూ.430కి పెరిగింది. మహబూబ్‌నగర్ నుంచి ఎంజీబీఎస్‌కు సూపర్ లగ్జరీ టికెట్ ధర నిరుడు వరకు రూ.220 ఉండగా.. ఇప్పుడు రూ.290కిపైగా వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.100 ఉంటే.. స్పెషల్ బస్సుల పేరుతో రూ.150 వరకూ వసూలు చేస్తున్నారు.
రూ.200 టికెట్ ధర ఉంటే.. రూ.300, రూ.320, రూ.350వరకు బస్సుల శ్రేణిని బట్టి ధరలను పెంచారు. దీంతో పండుగకు ఇంటికి వెళ్లాలనుకున్న తమను అదునుచూసి ఆర్టీసీ సంస్థ నిలువుదోపిడీ చేస్తుందని పలువురు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన ధరలను చూపిస్తూ పలువురు ప్రయాణికులు ఆర్టీసీ నిలువు దోపిడీని సోషల్ మీడి యా వేదికగా ఎండగడుతున్నారు. ఇదిలా ఉండగా, శుక్రవారం సాయంత్రం నుంచే అన్ని బస్టాండ్‌ల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. కొన్నిచోట్ల సరిపడా బస్సులు లేకపోవడంతో గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూశారు. కాగా, మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బస్సులు మాత్రం దసరా పండుగకు కంటికి కనిపించలేదు. దీంతో చాలామంది మహిళలు స్పెషల్ బస్సుల్లోనే ప్రయాణాలు సాగించారు. ఇక అరకొరగా కేటాయించిన ఉచిత బస్సుల్లో సీట్ల కోసం ఎప్పటిలాగే ఆడబిడ్డలకు ఎగబడ్డారు. దీంతో పలుచోట్ల తోపులాటలు, గొడవలు జరిగాయి. గత రాఖీ పండగకు ఒక్కరోకే ఆర్టీసీకి రూ.33.40 కోట్ల ఆదాయం సమకూరింది.