ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మొండిచేయి చూపించిందని ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 5వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రస్తావించకపోవడం, ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించడం పట్ల జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో చైర్మన్ కె. హనుమంతు ముదిరాజ్, వైస్ చైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బి.యాదగిరి ముక్తకంఠంతో ఖండించారు.
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఇవాళ సమావేశమైంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేయడమే లక్ష్యంగా భవిష్యతు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. అందులో భాగంగానే జేఏసీలో కలవని కార్మిక సంఘాలను కూడా తమలో భాగస్వామ్యం కావడానికి, ఉమ్మడి ఎజెండాతో, విశాల ఐక్యతతో ఒకే వేదిక ద్వారా ముందుకు పోవడానికి జూన్ 13వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. అందుకు సంబంధించిన ఆహ్వాన లెటర్లను అన్ని సంఘాల నాయకులకు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిచడం జరుగుతుందన్నారు.