హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయాలని ఆర్టీసీ (TGSRTC) కార్మికులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నారు. డిపోల ముందు నిరసన తెలుపుతున్నారు. పీఆర్సీ పెండింగ్ బకాయిలు, ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. 3 వేల కొత్త నియామకాలు చేపడుతామని మూడు మాసాలుగా ఊదరగొడుతున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని, వెంటనే నియామకాల నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ సిబ్బంది కరీంనగర్-1 డిపోలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. గతంలో పెండింగ్లో ఉన్న పేస్కేల్ చేసి, బాండ్ పైసలు ఇప్పించాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు.