TGSRTC | హైదరాబాద్, జనవరి 2 (నమస్తేతెలంగాణ) : జాతీయస్థాయిలో ఒకనాడు ఉత్తమ గుర్తింపు పొందిన ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్).. నేడు దివాలా దశకు చేరుకున్నది. కార్మికుల జీతం నుంచి సమకూర్చిన సొమ్ము నుంచి వారి అవసరాల కోసం అప్పులుగా ఇస్తూ ఆదుకున్న సంఘం నేడు తిరోగమనంలో పయనిస్తున్నది. దీంతో సంస్థలోని ఉద్యోగుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. పిల్లల చదువుల కోసం కొందరు, పెళ్లిళ్ల కోసం మరికొందరు, అనారోగ్య సమస్యలతో ఇంకొందరు, ఇతర కుటుంబ అవసరాల కోసం మరెందరో లోన్ కోసం సీసీఎస్‌లో దరఖాస్తు చేసుకుంటే నిధులు లేవని తేల్చి చెప్తున్నారు. సిబిల్ స్కోర్ సరిగా లేదన్న కారణంతో బ్యాంకులు రుణాలను నిరాకరిస్తున్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఫైనాన్షియర్ల వద్ద అధిక వడ్డీలకు ఆర్టీసీ ఉద్యోగుల, కార్మికులు అప్పులు చేస్తున్నారు. వచ్చే జీతంలో ఇంటి ఖర్చులుపోగా మిగతా సొమ్ము వడ్డీలకే సరిపోవడం లేదని, కుటుంబాలు ఆగమవుతున్నాయని ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు రూ.లక్షకు నెలకు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. తాము ప్రతినెలా జీతంలో 7 శాతం కోత పెట్టుకొని నిధిని సమకూర్చుకుంటే.. తమకే రుణాలు అందక ఇలా అప్పుల బారినపడటం దారుణమని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి బకాయిలు వచ్చే వరకు లోన్ దొరికే పరిస్థితి లేదని, తొలుత రిటైర్మెంట్ కేసులను పరిష్కరించాకే లోన్ చెల్లింపులు ఉంటాయని సమాధానం ఇస్తున్నారు. దీంతో అప్పటిదాకా ఎదురుచూసే పరిస్థితి లేక, వెంటనే అప్పు పుట్టక ప్రైవేటు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
ఆర్టీసీలోని సహకార పరపతి సంఘానికి ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లో ప్రతినెలా 7 శాతం మొత్తం జమ చేయడం ద్వారా నిధి ఏర్పడుతుంది. అందులోంచే ఉద్యోగులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు. దాదాపు రూ.3 వేల కోట్ల నిధితో వేల సంఖ్యలో ఉద్యోగులకు రుణాలు ఇస్తూ, కార్మికులను ఆదుకునే సంస్థగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌తోపాటు పలు పురస్కారాలను దక్కించుకున్నది. కానీ ఆర్టీసీ కొన్నేండ్లుగా ఈ నిధిని సొంతానికి వాడేసుకుని ఖాళీ చేసింది. ప్రస్తుతం వడ్డీతో కలిపి రూ.900 కోట్లకు పైగా సీసీఎస్‌కు ఆర్టీసీ చెల్లించాల్సి ఉన్నది.
సీసీఎస్‌లో నిధులు లేక ఆర్టీసీ ఉద్యోగులకు లోన్లు అందని పరిస్థితి నెలకొన్నది. దీంతో సీసీఎస్ గతంలో హైకోర్టును ఆశ్రయించగా, బకాయిలు చెల్లించాలని ఆర్టీసీని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు గత జూన్‌లో సీసీఎస్‌కు రూ.200 కోట్లు అందాయి. మరో రూ.150 కోట్లు బ్యాంకు నుంచి రుణం తెచ్చింది. ఈ మొత్తం నుంచి ఉద్యోగులకు ఉద్యోగులకు లోన్లు ఇచ్చింది. జూన్ వరకు పేరుకుపోయిన దరఖాస్తులకు ఊరట లభించింది. ఆ తర్వాత బకాయిల చెల్లింపు లేక లోన్ దరఖాస్తులు పేరుకుపోయాయి. ప్రస్తుతం 7 వేల మంది రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 40 వేల మంది ఉద్యోగులుంటే.. అందులో దాదాపు సగం మంది వరకు వివిధ అవసరాల కోసం సీసీఎస్ రుణాలపై ఆధారపడుతుంటారు.
ఉద్యోగుల ఒత్తిడిని భరించలేక బకాయిలు చెల్లించాలంటూ కొన్ని రోజులుగా సీసీఎస్ యంత్రాంగం ఆర్టీసీపై ఒత్తిడి పెంచుతున్నది. కనీసం బ్యాంకు నుంచి పొందేందుకు పూచీకత్తు అయినా ఇవ్వాలని కోరుతున్నది. కానీ, ఆర్టీసీ యాజమన్యం నుంచి సానుకూలత రావడం లేదు. సీసీఎస్ బకాయిలు చెల్లించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించి ఉన్నందున.. మళ్లీ తలుపుతట్టి, కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయాలని సీసీఎస్ యంత్రాంగం భావిస్తున్నట్టు తెలిసింది.