హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ సీజన్లో ప్రయాణికుల రద్దీ.. సంస్థకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఐదు రోజుల్లోనే ఆర్టీసీకి చార్జీల ద్వారా రూ.67.40 కోట్ల మేర ఆదాయం సమకూరినట్టు అధికారులు వెల్లడించారు. ఐదు రోజుల్లో ప్రత్యేక బస్సులు కూడా నడుపడంతో రోజూ సగటున రూ.13.48 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. అంతకుముందు ఆర్టీసీ కి రోజువారీ సగటు ఆదాయం రూ. 10.78 కోట్లుగా ఉండేది. సాధారణ రోజులతో పోలిస్తే స్పెషల్ బస్సులతో రోజూ అదనంగా సుమారు రూ.2.70 కోట్లు ఆదాయం వచ్చింది. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్తో పోటీగా ప్రత్యేక బస్సుల్లో ఆర్టీసీ అధిక చార్జీలు వసూలు చేసిందని ప్రయాణికులు ఆగ్రహం వ్య క్తం చేశారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ 6,431 ప్రత్యేక బస్సులు నడుతున్నది. 18,19 తేదీల్లో కూడా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీటిల్లోనూ 50 శాతం అదనపు చార్జీలు అమలులో ఉంటాయని చెప్పారు.