2024 అక్టోబర్ 6.. ఒకేరోజు ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లికి చెందిన ఠాకూర్ రమేశ్‌సింగ్ (45) హుజూరాబాద్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 15 రోజుల క్రితమే పరకాల డిపో నుంచి డిప్యూటేషన్‌పై హుజురాబాద్‌కు వచ్చాడు. ఎప్పటి మాదిరిగానే ఆదివారం డ్యూటీకి వచ్చి, ప్రయాణికులను ఎకించుకుని హుజూరాబాద్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరాడు. గజ్వేల్ సమీపంలోకి రాగానే ఒకసారిగా గుండెపోటుకు గురయ్యాడు. సమయస్ఫూర్తితో వెంటనే బస్సును రోడ్డు పకన ఆపి.. చనిపోయాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
2024 అక్టోబర్ 6న.. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు కండక్టర్ కూడా గుండెపోటుతో మృతి చెందాడు. చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన రాకం లింగమూర్తి (55) కరీంనగర్-2 డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. డ్యూటీకి వచ్చి ఆదివారం బస్టాండ్‌లో అకడికకడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆర్టీసీ సిబ్బంది కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్టు నిర్ధారించారు.
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల తరచుగా ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. డ్రైవర్లు స్టీరింగ్ పట్టుకొని గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చేయని తప్పులకు కండక్టర్లు బలవంతంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గంటల తరబడి డ్రైవర్ సీట్లో కూర్చోవడంతో వేలాది మంది డ్రైవర్లు పైల్స్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. సరైన నిద్రలేక, సమయానికి తిండిలేక, మానసిక ఆందోళనతో పక్షవాతం బారిన పడినవారు వందల్లో ఉన్నారంటే అతిశయోక్తికాదు. అయినా, ఇటు ప్రభుత్వం, అటు ఆర్టీసీ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నదనే వాదన ఆర్టీసీ కార్మికుల్లో వినిపిస్తున్నది. ఆర్టీసీ సంస్థలో కొన్నాళ్లుగా నియామకాలు లేకపోవడంతో మిగిలిన సిబ్బందిపై అధిక పనిభారం పడుతున్నదని డ్రైవర్లు, కండక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. వీటికితోడు ఓవర్‌లోడింగ్‌తో తమ సమస్యలు పట్టించుకునేవారే లేరని వాపోతున్నారు.
ఒక్కొక్కరూ 16 గంటల డ్యూటీ
ఆరీసీలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 వేల మంది కండక్టర్లు, 14 వేలపైచిలుకు డ్రైవర్లు ఉన్నట్టు సమాచారం. మోటర్ ట్రాన్స్‌పోర్టు యాక్టు ప్రకారం ఎవరైనా 8 గంటలు షిప్టు ప్రకారం మాత్రమే పని చేయాలి. కానీ, ప్రస్తుతం ఆర్టీసీలో ఒక్కో డ్రైవర్, కండక్టర్ రోజుకు కనీసం 14-16 గంటలు పనిచేస్తున్నామని వాపోతున్నారు. ఒక్కోసారి వారికి వీక్లీ ఆఫ్‌లు సైతం ఇవ్వడం లేదని అంటున్నారు. విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల అధిక రక్తపోటు, హృద్రోగాలు, పక్షవాతం, పైల్స్ వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు డ్రైవర్లకు కూడా టిమ్స్ ఇచ్చి.. కండక్టర్ డ్యూటీ కూడా చేయాలని బలవంత పెడుతుండటంతో డ్రైవింగ్ మీద ఏకాగ్రత కోల్పోతున్నామని డ్రైవర్లు అంటున్నారు. వీటన్నింటికి తోడు.. డిపోల్లో అడిగేవారు లేకపోవడంతో ఇష్టారీతిన మేజనర్లు, సూపర్వైజర్లు, కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని మండిపడుతున్నారు. 16గంటు డ్యూటీ చేస్తే.. ఒక రోజు సెలువు ఇచ్చినా మళ్లీ తక్షణమే 16 గంటలు డ్యూటీకి ఎక్కాల్సిన దుస్థితి ఉన్నదని చెప్తున్నారు. వెరసి ఆర్టీసీలో దారుణమైన శ్రమదోపిడీ జరుగుతున్నదని మండిపడుతున్నారు.
17వేలకు పైగా ఖాళీలు
ఆర్టీసీలో దాదాపు 17 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు రిటైర్ కాగా, వారి స్థానంలో కొత్త రిక్రూట్మెంట్లు లేకపోవడంతో ఉన్న సిబ్బంది మీదనే పనిభారం పడుతున్నది. సెలవులు ఇవ్వకపోడంతో అనారోగ్యం బారినపడుతున్నామని ఉద్యోగులు, కార్మికులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మూడ్రోజుల డ్యూటీని రెండ్రోజులకు, రెండ్రోజుల డ్యూటీని ఒక రోజుకు కుదించారని, మరోవైపు తిరగాల్సిన కిలోమీటర్లు పెంచి.. మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు. ఉదాహరణకు.. మూడ్రోజుల డ్యూటీని ముగ్గురు చేయాల్సి ఉండగా.. రెండ్రోజులకు కుదించడంతో ఆ డ్యూటీని ఇద్దరే చేయాల్సి వస్తున్నదని చెప్తున్నారు. దీంతో పని గంటలు దారుణంగా పెరుగుతున్నాయని వాపోతున్నారు. 250 కిలోమీటర్లు చేయాల్సిన డ్యూటీని.. 350-380 కిలోమీటర్లు, కొన్ని డిపోల్లో 400 కిలోమీటర్లకు పొడిగించడం తమ మానసిక స్థితితో ఆడుకోవడమేనని డ్రైవర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇలా చేయడం వల్ల.. సిబ్బంది లేని లోటును భర్తీ చేసుకోవచ్చనే కుట్రను ఆర్టీసీ యాజమాన్యం కొనసాగిస్తున్నదని అంటున్నారు.
ఓవర్‌లోడ్‌తో ప్రమాదాలు
ఇటీవల తెలంగాణలో ఆర్టీసీ ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం కొత్త బస్సులు కొనకపోవడం, పాతవాటినే రోడ్లపై తిప్పుతుండటంతో కొన్ని నడిరోడ్డుపై అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. మరికొన్ని వెహికిల్ కండిషన్, మెయింటనెన్స్ సరిగా లేకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నాయి. వీటికితోడు డ్యూటీ మధ్య డ్యూటీకి డ్రైవర్లకు తగిన విశ్రాంతి ఇవ్వకపోవడం కూడా ప్రమాదాలకు కారణమని ఆర్టీసీ ఉద్యోగులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా మహాలక్ష్మి పథకం వల్ల అన్ని బస్సుల్లో ఓవర్‌లోడ్ అవుతున్నదని అంటున్నారు. కండిషన్ లేని బస్సుల్లో బ్రేకులు పనిచేయకపోవడం, స్టీరింగ్ సరిగా తిరగకపోవడం, టైర్లు ఊడిపోవడం, ఎదురుగా వచ్చే వాహనాలను ఢీ కొట్టడం, ఇంజిన్ ఫెయిలై పొలాల్లోకి, కాల్వల్లోకి దూసుకెళ్లడం వంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఓవర్‌లోడ్ కారణంగా బస్ కిలోమీటర్ పర్ లీటర్ (కేఎంపీఎల్) కూడా భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో 50 లీటర్ల డీజిల్‌తో 300 కిలోమీటర్ల మైలేజ్ వచ్చేదని, ఇప్పుడు అంతే దూరానికి 60 లీటర్ల అవసరమవుతున్నదని చెప్తున్నారు.
మహాలక్ష్మితో కండక్టర్లకు చుక్కలు
మహాలక్ష్మి పథకం నేపథ్యంలో కండక్టర్లకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ప్రయాణికులకు టికెట్లు ఇష్యూ చేసేందుకు సమయం తక్కువగా ఉంటున్నదని, త్వరత్వరగా టికెట్లు కొట్టడం వల్ల ఒక్కోసారి తప్పులు జరుగుతున్నాయని అంటున్నారు. విపరీతమైన రద్దీలో టిమ్స్ పనిచేయక, కీ బోర్డు బటన్ పనిచేయక, కొన్ని టిమ్స్ జంపింగ్ అవ్వడం వలన కండక్టర్లు వారికి తెలియకుండానే చిన్నచిన్న కేసుల్లో ఇరుక్కుంటున్నారని, 25 ఏండ్ల క్లీన్ రికార్ట్ ఉన్నప్పటికీ కొందరిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు తట్టుకోలేక పలువురు కండక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇటీవల జరిగిన మరణాలు, ప్రమాదాల వివరాలు
మరణించిన డ్రైవర్లు, కండక్టర్లు..
ఆత్మగౌరవం చంపుకొని పనిచేస్తున్నారు
ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించకపోవడంతో కార్మికుల సమస్యలను పట్టించుకునే నాథుడు లేడు. ఆర్టీసీలో ఎంతోమంది కార్మికులు ఆత్మాభిమానం చంపుకొని పనిచేస్తున్నారు. డిపో మేనేజర్లు, సూపర్వైజర్ల నిర్బంధంలో బందీలుగా ఉన్నారు. వారిని భయభ్రాంతులకు, వేధింపులకు గురిచేస్తున్నారు. వెరసి తీవ్ర ఒత్తిడికి లోనై, కొంతమంది ఆత్మసె్థైర్యం కోల్పోయి విధి నిర్వహణలోనే హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. పని ఒత్తిడి వల్ల బస్సుల్లో చనిపోయేవారు కొందరైతే.. తీవ్ర మనోవేదనతో ఇండ్ల వద్ద, దవాఖానల్లో చనిపోతున్నవారు మరికొందరు. ప్రభుత్వం, యాజమాన్యం కార్మికులపై అధిక పనిభారాన్ని తగ్గించాలి.
– ఈదురు వెంకన్న,ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి