హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సుల్లో విధులు నిర్వర్తించే డ్రైవర్లు తమ వెంట సెల్ఫోను తీసుకెళ్లరాదని సంస్థ యాజమాన్యం నిషేధం విధించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 రీజియన్ల పరిధిలోని ఒకో డిపోలో సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతానికి ఫరూక్నగర్ (హైదరాబాద్), కూకట్పల్లి (సికింద్రాబాద్), కొల్లాపూర్ (మహబూబ్నగర్), సంగారెడ్డి (మెదక్), మిర్యాలగూడ (నల్లగొండ), వికారాబాద్ (రంగారెడ్డి), ఉట్నూర్ (ఆదిలాబాద్), జగిత్యాల (కరీంనగర్), ఖమ్మం (ఖమ్మం), కామారెడ్డి (నిజామాబాద్), పరకాల (వరంగల్) డిపోల్లో ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చే ఫలితాల మేరకు దశలవారీగా అన్ని డిపోల్లో అమలు చేయనున్నారు. దీంతో ఆర్టీసీ డ్రైవర్లు విధుల్లో చేరేముందు తమ సెల్ఫోన్లను స్విచ్చాఫ్ చేసి, డిపోలోని సెక్యూరిటీ అధికారి వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. విధులు ముగిశాక వాటిని తిరిగి తీసుకోవాలి.
టిమ్లు తీసుకోండి..
యాజమాన్య నిర్ణయంపై డ్రైవర్లు మండిపడుతున్నారు. యాజమాన్యానికి చిత్తశుద్ధి ఉంటే డ్రైవర్ల నుంచి సెల్ఫోన్లను కాకుండా టికెట్ ఇష్యూయింగ్ మెషీన్ (టిమ్)లను తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. టిమ్లు మొరాయిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.