హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సర్కారు చరిత్రాత్మక నిర్ణ యం తీసుకొన్నదని, ఆర్టీసీని సర్కారులో విలీ నం చేస్తున్నట్టు ప్రకటించి కార్మికులు, ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆనందం వ్యక్తంచేశారు. ఒక్క నిర్ణయంతో సీఎం కేసీఆర్ కార్మికుల కన్నీళ్లను తుడిచేశారని పేర్కొన్నారు. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులపైనే ఉన్నదని తెలిపారు. మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
మీరు చైర్మన్‌గా ఉన్న సమయంలో చరిత్రా త్మక నిర్ణయం రావడంపై ఏమంటారు?
ఇది నిజంగా నా అదృష్టం. 90 ఏండ్ల చరి త్ర ఉన్న ఆర్టీసీలో ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకం. ఇందులో నాదేం లేదు. అంతా సీఎం గారి చలువ.. ఆయన నిర్ణయం. ఆర్టీసీలో ఉన్న 43 వేల మందికిపైగా ఉద్యోగులు, కార్మికుల తరఫున సంస్థ చైర్మన్‌గా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకైతే చాలా సంతోషంగా ఉన్నది.
సీఎం కేసీఆర్ నిర్ణయం వెనుక అసలేం జరిగింది? అందులో మీ పాత్ర ఏమిటి?
నిజానికి ఆర్టీసీ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది. ఆర్టీసీపై ఒక నిర్ణయం తీసుకోండి.. ఆర్థికంగా అండదండలు కావాలని అడిగా. కనీసం వెయ్యి కోట్లు గ్యారంటీ ఇవ్వండి.. ఒక పీఆర్సీ ఇవ్వండి అని విజ్ఞప్తి చేశాను. ఇలాంటి సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లా. దీనిపై ఆయన నివేదిక తెప్పించుకొన్నారు. పీఆర్సీగానీ, వెయ్యి కోట్లు గానీ ఇస్తారని అనుకొన్నా. రిపోర్టు పరిశీలించిన తర్వాత నన్ను, ఎండీని పిలిచారు. అక్కడ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఉన్నారు. ‘ఇవన్నీ కావు బాజిరెడ్డిగారు.. మెర్జ్ (విలీనం) చేద్దాం’ అని అన్నారు. సార్.. అలా చేస్తే వారు జీవితంలో మిమ్మల్ని మర్చిపోరు అన్న. అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారని అనుకోలే. అది కేవలం సీఎం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యం. ఈ నిర్ణయం వెనుక ఇతర రాష్ర్టాల్లోని ఆర్టీసీ పరిస్థితులనుకూడా ఆరా తీశారు. అక్కడి వాస్తవాలను తెలుసుకొని.. కష్టాలను ఒక్క నిర్ణయంతో తుడిచేశారు.
సర్కారులో ఆర్టీసీ విలీనం తర్వాత కార్పొరేషన్ ఎట్లా ఉండబోతున్నది?
సర్కారు దీనిపై ఉన్నతాధికారులతో కూడిన కమిటీ వేసింది. వాళ్లు పరిశీలిస్తారు. కమిటీ రిపోర్టును బట్టి ఉంటుంది. కార్పొరేషన్ ఆస్తులను వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తారనుకొంటున్నా. అలాగే లీజుకు, అద్దెకు ఇస్తారేమో. కమర్షియల్, లాజిస్టిక్స్, రెవెన్యూ లాంటి అన్ని రకాల విభాగాలు ఉంటాయి. కమిటీ రిపోర్టును బట్టి ప్రభుత్వం పరిశీలించి ఓ నిర్ణయం తీసుకొంటుంది.
చరిత్రాత్మక నిర్ణయం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు చైర్మన్‌గా మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
ఆర్టీసీ కార్మికుల కష్టాలన్నీ ఒక్క నిర్ణయంతో తుడిచిపెట్టారు సీఎం కేసీఆర్. వచ్చిన ఈ మంచి అవకాశాన్ని కార్మికులు కాపాడుకోవాలి. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యతవారిపైనే ఉన్నది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించవద్దు. కార్మికులంతా వారి కుటుంబాలతో సంతోషంగా ఉండాలనేది నా సందేశం. గతంలో జరిగిన పీడకలలన్నీ మర్చిపోయి.. భవిష్యత్తులో వాళ్లందరూ సుఖసంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నా.
ఆర్టీసీ కార్మికుల కష్టాలన్నీ తీరినట్టేనా?
ఒక్క నిర్ణయంతో కార్మికుల కష్టాలన్నీ తీరిపోయాయి. నిజంగా.. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు.. వారి కష్టాలు చూస్తే మనసు కలకలమంటుంది. నిజంగా వాళ్లు పడుతున్న బాధలు వర్ణనాతీతం. జాబ్ సెక్యూరిటీ లేదు. పింఛను కేవలం రూ.1500 లేదా 2000లే. అధికారుల వల్ల వచ్చిన ఇబ్బందులుకూడా ఉన్నా యి. సస్పెన్షన్లు, రిమూవల్లు ఇకపై ఉండ వు. చిన్న దానికి, పెద్దదానికి వారి వేతనాలు కట్చేసేవారు. ఇవన్నీ తొలగిపోయాయి. జాబ్ సెక్యూరిటీ వచ్చింది. 43 వేల మందికిపైగా కార్మికులున్న సంస్థకు 3వేల కోట్ల అప్పు ఉన్నది. రాత్రింబవళ్లు కష్టపడుతున్నా ఇందులో నుంచి బయటపడటం లేదు. రుణం కావాలంటే వచ్చేది కాదు. పీఎఫ్ దిక్కులేదు.. బాధలన్నీ పోయాయి. ఇప్పుడు దాదాపు 30 శాతం వరకు జీతం పెరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. ఇప్పటికే మేము ఇచ్చిన 7 డీఏల వల్ల దాదాపు రూ.10 వేల వరకు పెరిగింది. పీఆర్సీ ఇస్తే అదనంగా రూ.480 కోట్ల భారం పడేది. సంస్థ ఆ భారంకూడా మోసే పరిస్థితిలో లేదు. సీఎం తీసుకొన్న ఒక్క నిర్ణయంతో ఈ సమస్యలన్నీ పోయాయి.