ఖలీల్‌వాడి, మే 11 : ప్రజలు సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాతో కలిసి సిటీ బస్సు సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. 30 సంవత్సరాల తర్వాత మళ్లీ నిజామాబాద్ నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో సిటీ బస్సులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
నగర ప్రజలందరూ సిటీ బస్సుల్లో సురక్షితమైన ప్రయాణాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ ప్రతి యేటా బడ్జెట్లో రూ.1500 కోట్లు ఆర్టీసీకి కేటాయిస్తున్నారని తెలిపారు. నగరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన బస్సు సర్వీసులు కొనసాగుతుండడంతో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సరిపోవడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నగరంలో అతి త్వరలోనే నూతన బస్టాండ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మాట్లాడుతూ ..నగర ప్రజల సౌలభ్యం కోసం 4 ప్రధాన దారుల్లో 6 సిటీ బస్సులను ప్రారంభించామన్నారు. రోజువారి పనుల కోసం నగరానికి వచ్చే వారికి పేద, మధ్య తరగతి సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా రూట్ మ్యాప్‌ను తయారు చేశామన్నారు.
అతి త్వరలోనే బస్టాండ్ కోసం స్థల సేకరణ చేసి అన్ని హంగులతో కొత్త బస్టాండ్ నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నగర మేయర్ నీతూకిరణ్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.