హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీ ద్వారా కొరియర్ సేవలు అందించాలనే కేసీఆర్ ఆలోచన ఏటా రూ.100 కోట్లపైగా లాభాలను ఆర్జించి పెట్టింది. నమ్మకమైన, నాణ్యమైన సేవలు ఆర్టీసీ అందించేందుకు తెలంగాణ ఆర్టీసీలో 2020 జూన్ 19న కార్గో సేవలను ప్రారంభించింది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యవేక్షణలో పురుడుపోసుకున్న కార్గో సేవలు, మొదటి 9 నెలల్లోనే రూ.36.26 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లోనూ సేవలు ప్రారంభించారు. దీంతో ఆ తర్వాత ఏడాదిలోనే ఆర్టీసీ కార్గో సేవల ద్వారా అనూహ్యంగా రూ.68.19 కోట్లు అందుకున్నది. ఇక 2022-23 మార్చి నాటికి రూ.93.82 కోట్లకు చేరింది. 2023-24 నాటికి రికార్డుస్థాయిలో రూ.111 కోట్లకు చేరింది.
ఆర్టీసీ సంస్థ ద్వారా ఓ ప్రణాళికాబద్ధంగా సరికొత్త సేవలను ప్రవేశపెట్టిన కేసీఆర్, ఆ ఆదాయాన్ని రికార్డు స్థాయికి చేర్చారు. ఆర్టీసీ కార్గో సేవల్లో ఎక్కడా లోటుపాట్లు లేకుండా అధికారులకు దిశానిర్దేశం చేసి, దాని పర్యవేక్షణ బాధ్యతను నాటి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అప్పగించారు. దీంతో నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందుతుండటంతో ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు బదులు ఆర్టీసీ కార్గో సేవలకు జనం జై కొట్టారు. అతితక్కువ సర్వీస్ చార్జీలు ఉండటం, వేగంగా, పారదర్శకంగా కొరియర్, కార్గో సేవలు అందడంతో ప్రజలు విస్తృతస్థాయిలో వినియోగించుకున్నారు. 11వేల రూట్లలో అన్ని జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల నుంచి ఎక్కడికైనా పార్సిల్ సేవలు అందాయి.
కాంగ్రెస్ హయాంలో తగ్గిన ఆదాయం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా ఆర్టీసీ కార్గో సేవల్లో నాణ్యత లోపించింది. పార్సిళ్లలో వచ్చే వస్తువులు కొన్ని మాయం అవుతుండేవి. హైదరాబాద్ నగరంలో ఉండే తమ బిడ్డలకు తల్లిదండ్రులు కార్గో ద్వారానే బియ్యం పంపేవారు. ఆ సేవల్లోనూ తీవ్రమైన నిర్లక్ష్యం కనిపించేది. దీంతో ప్రజలు మళ్లీ ప్రైవేట్ పార్సిల్ సర్వీసులకు మళ్లారు. 2023-24లో అత్యధికంగా రూ.111 కోట్ల ఆదాయం ఆర్జించిన కార్గో ఆదాయం, 2024-25లో రూ.90 కోట్లకు పడిపోయింది. అది సరిపోదన్నట్టు ఏప్రిల్ 2025 నుంచి డిసెంబర్ 2025కు అది రూ.71 కోట్లకు పడిపోయింది. దీంతో ఆర్టీసీ కార్గో సేవలను భారంగా భావించిన ప్రభుత్వం, 2025 అక్టోబర్‌లో కేవలం నెలకు రూ.3 కోట్లు చెల్లించే ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. దీంతో 10 నుంచి 15 ఏండ్లపాటు ఆర్టీసీ కార్గో సేవలు ఆ ప్రైవేట్ సంస్థ ఆధీనంలోనే ఉండనున్నాయి.