చింతలపాలెం, ఏప్రిల్ 20 : ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం జేలోడు కుంట వద్ద ఆదివారం చోటుచేసుకున్నది. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కోదాడ నుంచి నక్కగూడెం వెళ్తున్నది. ఈ క్రమంలో చింతలపాలెం శివారులోని జేలోడు కుంట, కట్ట మైసమ్మ గుడి వద్దకు రాగానే అకస్మాత్తుగా బస్సు స్టీరింగ్ రాడ్ విరగడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. వెంటనే స్థానిక యువకులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు బోల్తా పడిన సమయంలో 65 మంది ప్రయాణికులు ఉండగా, దాదాపు పదిమందికి తీవ్ర గాయాలు, 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే క్షత్రగాత్రులను అంబులెన్స్‌లు, ప్రైవేట్ వాహనాల ద్వారా మేళ్లచెర్వు, హుజూర్నగర్, కోదాడ, ఖమ్మం దవాఖానలకు తరలించారు. ఈ బస్సు బైక్‌ను కూడా ఢీకొట్టడంతో వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.