చౌటుప్పల్ రూరల్, నవంబర్ 4 : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అతివేగంతో వస్తున్న ఆర్టీసీ బస్సు పల్టీ కొట్ట గా, నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపోకు చెందిన బస్సు సోమవారం మధ్యా హ్నం హైదరాబాద్ నుంచి నల్లగొండకు బయల్దేరింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం పరిధిలోకి రాగానే అతివేగం కారణంగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయింది. బస్సులో 48 మంది ఉండగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ జంగయ్య నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
ఐఏఎస్ వాణీప్రసాద్కు స్వల్ప గాయాలు ;విజయవాడ హైవేపై పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
కోదాడ, నవంబర్ 4 : ఏపీ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్ ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. వాణీప్రసాద్ సోమవారం హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో వెళ్తుండగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని డ్రైవర్ ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. స్వల్ప గాయలతో కారులో ఉండిపోయిన వాణీప్రసాద్ను స్థానికులు బయటకు తీసుకొచ్చారు. ప్రమాద స్థలానికి కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ చేరుకుని చికిత్స కోసం ఆమెను సూర్యాపేట ఏరియా హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ప్రమాదానికి కొద్ది దూరంలోనే వ్యవసాయ బావి ఉన్నట్టు స్థానికులు తెలిపారు. త్రుటిలో ఘోర ప్రమాదం తప్పినట్టయింది.