జమ్మికుంట, ఫిబ్రవరి 6: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ మినీ బస్సు శుక్రవారం అదుపుతప్పి జమ్మికుంటలోని ఆర్వోబీ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 22 మందికి గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. హుజూరాబాద్ డిపోకు చెందిన మినీ బస్సు శుక్రవారం 41 మంది ప్రయాణికులతో వెళ్తుండగా జమ్మికుంట బస్స్టాండ్ సమీపంలోని ఆర్వోబీ ఎక్కుతున్న క్రమంలో అదుపుతప్పి ఫుట్పాత్ డివైడర్ను ఢీకొట్టడంతో ముందు టైర్ పగిలి, బ్రిడ్జి రక్షణ గోడను ఢీకొట్టి ఆగిపోయింది. ప్రయాణికులు దిగేందుకు అనుకూలంగా లేకపోవడంతో స్థానికుల సాయంతో కిటికీల్లోంచి బయటకు వచ్చారు. ఈ ఘటనలో 22 మందికి స్వల్ప గాయాలు కాగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్సుల్లో స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం పలువురిని హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. బస్సుకు సరైన ఫిట్నెస్ లేకపోవడమే కారణమని పలువురు చెబుతున్నారు. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పిందని, డివైడర్ను ఢీకొట్టడంతో టైర్ పగిలిందని డ్రైవర్ రాజమౌళి, హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ చెబుతున్నారు.