హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పండుల సమయంలో ఆర్టీసీ బస్సెక్కాలంటే భయమేస్తున్నదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఏ పండుగ వచ్చినా టీజీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచేస్తున్నదని ఘొల్లుమంటున్నారు. ఒక్కో టికెట్‌పై కనీసం 50 శాతం వరకూ రేట్లు పెంచి.. ప్రయాణికులను దోచుకుంటున్నదని వాపోతున్నారు. ప్రతిసారి పాత జీవోలను సాకుగా చూపుతూ తమను జేబులు కొల్లగొడుతున్నదని మండిపడుతున్నారు. ప్రస్తుతం దసరా సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో 7,754 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ రోడ్డుపైకి దింపనుంది. ఇవి శనివారం నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు తిరగనున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రారంభం కానుండటంతో ఈ నెల 27 నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగనున్నది. వీరి కోసం ‘స్పెషల్’ అంటూ ఏర్పాటుచేస్తున్న సిటీ బస్సులలో కరీనంగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ వంటి దూరపు ప్రాంతాలకు వెళ్లడం అసౌకర్యంగా ఉన్నదని ప్రయాణికులు అంటున్నారు.
రద్దీ పెరిగితే.. టికెట్ రేట్ చుక్కల్లోనే
ఇటీవల రాఖీ పండుగను ఆర్టీసీ సంస్థ అద్భుతమైనరీతితో ‘క్యాష్’ చేసుకుంది. దూరాన్ని బట్టి ప్రత్యేక బస్సుల్లో 20 నుంచి 30శాతానికి మాత్రమే చార్జీలు పెంచామని చెప్పిన అధికారులు.. రద్దీ తీవ్రంగా ఉన్న చోట చార్జీలను 50-100 శాతానికి పెంచారు. అదే ఫార్ములా ఈసారి దసరాకు కూడా ఉంటుందని ఆర్టీసీ ముందుగానే తెలియజేసింది. దీంతో ప్రతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకున్న తమను అదునుచూసి ఆర్టీసీ సంస్థ నిలువుదోపిడీ చేస్తున్నదని ప్రయాణికులు వాపోతున్నారు. నిరుడు ఉన్న రద్దీకి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడటంతో.. ఈ సారి స్పెషల్ బస్సు సర్వీసులను పెంచింది. అవసరమైన చోట సిటీ బస్సులు, డీలక్స్, సూపర్ డీలక్స్‌లను స్పెషల్ బస్‌లుగా నడిపేందుకు సిద్ధమైంది. ఇటువంటి రోజుల్లో చాలా రూట్లలో రెగ్యులర్ బస్సులు కనిపంచకపోవడంతో స్పెషల్ బస్సుల్లో ఎక్కుతున్నారు. దీంతో సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.100 ఉంటే.. స్పెషల్ బస్సుల్లో రూ.150 వరకూ వసూలు చేయనున్నారు. రూ.200 టికెట్ ధర ఉంటే.. రూ.300 వరకు వసూలు చేయనున్నారు.
అదునుచూసి.. పాయింట్‌పైకి స్పెషల్ బస్సులు
హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు వెళ్లే రూట్లలో స్టార్టింగ్ పాయింట్లో ప్రయాణికులు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే స్పెషల్ బస్‌లను వదులుతున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో గంటల తరబడి బస్సు కోసం వేచి చూసిన వారు.. వచ్చిన ఆ ఒక్క స్పెషల్ బస్సును అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయా డిపోల నుంచి రెగ్యులర్‌గా తిరిగే బస్సులకే స్పెషల్ బోర్డులు తగిలించి తిప్పడం ఆర్టీసీకి పరిపాటిగా మారిందని వాపోతున్నారు. ఏర్పాట్ల విషయంలో లోపాలు పెట్టుకొని.. తమ భావోద్వేగాలతో ఆడుకుంటూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇటీవల స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్న నేపథ్యంలో ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా బస్టాండ్లు, బస్ పాయింట్లలో ఈసారి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు.