హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందరికీ మరింత చేరువచేసేలా చర్యలు చేపడుతున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ఓ ట్వీట్ పెట్టారు. దివ్యాంగులకు సైతం ఆర్టీసీని మరింత చేరువచేసేందుకు చర్యలు చేపడుతున్నామంటూ.. కొందరు దివ్యాంగులను వీల్‌చైర్‌లో బస్‌స్టాండ్ లోపలికి తీసుకొస్తున్న సిబ్బంది ఫొటోలను ట్వీట్‌కు జతచేశారు. విధిలేని పరిస్థితుల్లోనే ఆర్టీసీ చార్జీలను పెంచేందుకు సిద్ధమయ్యామని, దీన్ని ప్రయాణికులంతా అర్థం చేసుకుని టీఎస్ఆర్టీసీని ఆదరించాలని మరో ప్రకటనలో సజ్జనార్ కోరారు.