హైదరాబాద్ : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టీజీఎస్ ఆర్టీసీ( TGS RTC ) ప్రారంభించిన సమ్మెను( Strike ) రేపటి నుంచి మరింత ఉదృతం చేసేందుకు సన్నహాలు ప్రారంభించింది. గురువారం అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట మహాధర్నాను నిర్వహించాలని జేఏసీ ( JAC ) నాయకులు పిలుపునిచ్చారు. ఉదయం 5 గంటల నుంచి ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ప్రభుత్వం, యాజమాన్యం సమ్మె డిమాండ్లను పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తూ దాటవేత ధోరణి అవలంబిస్తూ, ప్రజలను ఆర్టీసీ కార్మిక వర్గాన్ని తప్పుదారి పట్టిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వం వేసిన కమిటీ అధికారులే ఇప్పటికిప్పుడు సమస్యలు పరిష్కరించలేమని చేతులెత్తేయడం వల్ల విధిలేని పరిస్థితుల్లో సమ్మెను ప్రారంభించవలసి వచ్చిందని వెల్లడించారు.
ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ప్రభుత్వం లో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసేంతవరకు, 2021 వేతన సవరణ 30 శాతం తగ్గకుండా అమలు చేసేంతవరకు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులను రద్దుచేసి ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేసే ఉత్తర్వులను రద్దు చేసే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, అన్ని యూనిట్లు, అన్ని వర్క్ షాప్ లలో మహాధర్నాలను జయప్రదం జేయాలని జేసీసీ నాయకులు కోరారు.