హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆరెస్సెస్సే అసలైన దేశ వ్యతిరేకి అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా విమర్శించారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించిన అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 16వ జాతీయ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రిమో ట్ అవసరం లేకుండానే ఆరెస్సెస్ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ అధికారంలో కొనసాగితే దేశాన్ని ఫాసిస్టు దేశంగా, మత రాజ్యంగా మార్చే ప్రమాదం ఉన్నదన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు భగత్‌సింగ్, చెగువేరా వంటి విప్లవ కిశోరాలను ఆదర్శం గా తీసుకొని యువత పోరాడాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో అనే క మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. ఆరెస్సెస్ బ్రిటీష్ వారితో చేతులు కలిపిందని ఆరోపించారు. ప్రధాని మోదీ బడా కార్పొరేట్ సంస్థలకు, అదానీ, అంబానీలకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. దేశ సంపదను, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే ప్రజలకు ఏమి మిగులుతుందని ప్రశ్నించారు.