హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనకు కల్పించిన భద్రతను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆయనకున్న ‘వై’ క్యాటగిరీని ‘ఎక్స్’కు కుదించింది. నామమాత్రంగా ఉండే ఈ ఎక్స్ క్యాటగిరీలో ఇద్దరు సిబ్బంది మాత్రమే ఆయన వెంట ఉంటారు. కాగా ఈ సిబ్బందిని వెనుకకు రావాలని ఇంటెలిజెన్స్ విభాగంలోని ఐఎస్‌డబ్ల్యూ ద్వారా మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. ఆయనకు సెక్యూరిటీ అవసరంలేదని, ప్రస్తుతమున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో జూలై ఒకటి నుంచి ఐఎస్‌డబ్ల్యూ ఆఫీసులో రిపోర్టు చేయాలని డ్రైవర్‌కు మౌఖికంగా చెప్పింది. దీంతో తన 26 ఏండ్ల ఉద్యోగకాలంలో తెలుగు రాష్ర్టాల్లోని ఎన్నో అసాంఘికశక్తులతో పోరాడిన ఆయన భద్రతపట్ల సర్వత్రా ఆందోళన నెలకొన్నది. తనకు భద్రత తొలగింపుపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వానికి, పోలీసుశాఖకు లేఖరాసినట్టు తెలిసింది.
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు నక్సలైట్ల నుంచి ఫ్యాక్షనిస్టుల వరకూ, ఆఖరికి తీవ్రవాదుల నుంచీ తీవ్రమైన ముప్పు ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తన 26 ఏండ్ల సర్వీసులో దాదాపు 12 నుంచి 15 ఏండ్లు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనే పనిచేశారని చెప్తున్నారు. మొదటి పోస్టింగ్ బెల్లంపల్లి ఏఎస్పీగా, ఆ తర్వాత కరీంనగర్ ఎస్పీగా, వరంగల్ ఓఎస్డీగా కీలకమైన ఆపరేషన్స్ నిర్వహించారు. అనంతపురం ఎస్పీగా ఉన్నప్పుడు పరిటాల రవి హత్య సమయంలో ఆయనే అకడ బాధ్యతల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన గత 20 ఏండ్లుగా బుల్లెట్‌ప్రూఫ్ కారునే వాడుతున్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల.. ఆయన ఇన్నాళ్లూ వాడింది బుల్లెట్‌ప్రూఫ్ కారు అని ప్రత్యర్థులకు తెలిసిపోయింది. ఇప్పుడు అది కూడా లేకపోవడంతో ఆయన భద్రతపై మరింత ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆయన బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు కూడా అతనికి ఉన్న ముప్పు దృష్ట్యా.. కేసీఆర్ ప్రభుత్వం అత్యాధునిక బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దానిని పూర్తిగా తొలగించింది.
దేశంలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయినందున ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఎలాంటి ప్రమాదం లేదని, తెలంగాణలో మావోయిస్టులు అందరూ లొంగిపోయారని, వారిలో ఎవ్వరూ దాడి చేసే పరిస్థితుల్లో లేరని, అందుకే ఆయనకు భద్రతను తొలగిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే, ఎలాంటి థ్రెట్ లేని సీఎం సోదరులకు అనధికారికంగా భద్రత, వాహనాలు ఇప్పించి మరీ ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ.. నిస్వార్థంగా పోలీసుశాఖకు సేవలందించిన ఆర్ఎస్పీకి సెక్యూరిటీ తొలగించడం పట్ల రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక పరిటాల రవిని చంపినట్లే.. ఫ్యాక్షనిస్టులతో నన్ను చంపించాలని అనుకుంటున్నారు’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయమై మరింత చర్చ జరగకుండా ఉండేందుకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరో నలుగురికి ‘వై’ క్యాటగిరీ భద్రత తగ్గించినట్టు విశ్వసనీయ సమాచారం.