సంగారెడ్డి, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): మంజీరా నదిపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతున్నది. కరంజా ప్రాజెక్టు దిగువన మంజీరా నదిపై కొత్తగా రోడ్-కమ్-బరాజ్, చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి పూనుకుంటున్నది. ఇదే జరిగితే సంగారెడ్డి, మెదక్ జిల్లాల రైతులు, ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు మరింత పెరుగనున్నాయి. ముఖ్యంగా మంజీరా నదిలో ప్రవాహం తగ్గడంతోపాటు సింగూరు డ్యామ్‌లో నీటిమట్టం తగ్గే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ రెండు జిల్లాలలకు సాగు, తాగునీటి అవసరాలపై తీవ్రప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. 2014-15లో మంజీరా నదిపై రోడ్-కమ్-బరాజ్, అక్రమ చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి యత్నించగా.. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అప్పట్లో కర్ణాటక వెనక్కితగ్గింది. సంగారెడ్డి జిల్లాలోని నారింజ ప్రాజెక్టు నుంచి కరంజా ప్రాజెక్టులోకి నీళ్లు వెళ్తాయి. మంజీరా ఉపనది కరంజా నదిపై బాల్కి తాలూకాలోని బైయల్హల్లి వద్ద 7.5 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించారు. కరంజా వరద మంజీరలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం 0.1 టీఎంసీ నుంచి 0.2 టీఎంసీ సామర్థ్యంతో చెక్‌డ్యామ్‌లు, రోడ్-కమ్-బరాజ్ నిర్మాణానికి యత్నిస్తున్నది. ఇదే జరిగితే మంజీరలోకి వచ్చే 1 నుంచి 2 టీఎంసీల జలాలు రాకుండా పోతాయి. కర్ణాటక సర్కార్ ప్రయత్నాలను అడ్డుకోవాలని సంగారెడ్డి జిల్లా రైతాంగం, ప్రజలు రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేస్తున్నారు.