మహబూబ్‌నగర్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో భారీ అక్రమాలు వెలుగుచూస్తున్న క్రమంలో స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగింది. ఈ మేరకు నారాయణపేట జిల్లా పోలీసులతోపాటు రెవెన్యూ అధికారులను ఆరా తీసినట్టు సమాచారం. అదేవిధంగా భారీగా అక్రమాలు జరిగిన పేరపళ్ల గ్రామానికి వెళ్లి అక్కడి రైతుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. అదే సమయంలో ఇంటెలిజెన్స్ అధికారులు సైతం దర్యాప్తు ప్రారంభించారు. అయితే అక్రమార్కులు.. తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి ఏం జరుగలేదని పత్రికా ప్రకటన విడుదల చేయాలని హుకుం జారీ చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై నారాయణపేట ఆర్డీవో రమేశ్.. అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాల్సింది పోయి.. చాట్ జీపీటీని అడిగి అక్రమాలు జరుగలేదని వివరణ ఇవ్వడం, డీపీఆర్వోను సైతం అదే ప్రకటనను విడుదల చేయాలని కోరడం చర్చనీయాంశమైంది.
కాగా, అక్రమాలకు సహకరించిన ఇద్దరు రెవెన్యూ అధికారులపై వేటుకు సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు ఎమ్మెల్యే పీఏ ఆగడాలపై కూడా ఇంటలిజెన్స్ నిఘా పెట్టినట్టు కొందరు కాంగ్రెస్ నేతలే బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా భూసేకరణ అంశంలో రైతుల వద్ద లంచం తీసుకుంటూ మూడు నెలల క్రితం నారాయణపేట ఆర్డీవో పట్టుబడటం గమనార్హం. మొత్తానికి ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలకు ప్రభుత్వం స్పందించి ఇప్పటికే భూ పరిపాలన శాఖ కార్యదర్శి విచారణ చేపట్టడం, మరోవైపు విజిలెన్స్, ఇంటెలిజెన్స్ టీములు వేర్వేరుగా రంగంలోకి దిగడంతో అక్రమార్కుల్లో ఆందోళన మొదలైంది.
చాట్ జీపీటీలో ఆర్డీవో కౌంటర్
ఎత్తిపోతల పథకానికి ఆర్డీవోనే భూసేకరణ ప్రధాన అధికారి. ఆయన నేతృత్వంలో ఆ ప్రక్రియంతా జరుగుతుంది. దాదాపు 2,700 ఎకరాలకు భూసేకరణ జరుగుతుండగా అందులో కేవలం నారాయణపేట మండలం పేరపళ్లా గ్రామంలోనే భారీగా అక్రమాలు బయటపడ్డాయి. అలాంటిది స్వయంగా ఆర్డీవోనే చాట్ జీపీటీని అడిగి వివరాలను టైప్ చేసి కౌంటర్ ఇవ్వడం సంచలనం రేపుతున్నది. విచారణ కోసం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ స్వయంగా వచ్చి వెళ్లిన 24గంటల తర్వాత ఎలాంటి అక్రమాలు జరుగలేదని ఆర్డీవో ‘నమస్తే తెలంగాణ’కు వివరణ ఇచ్చుకున్నారు. ఈ వివరణలో అసమగ్ర సమాచారంతోపాటు చాట్ జీపీటీని అడిగి కౌంటర్ ఇవ్వడం అధికార యంత్రాంగం ఉదాసీనతకు అద్దం పడుతున్నది. ఈ మెసేజ్‌ను ఫోన్లో స్క్రీన్‌షాట్ తీసి డీపీఆర్వోకు పంపిస్తే ఆయన ‘నమస్తే’ ప్రతినిధికి అదే రకంగా పంపారు. సీఎం ఇలాకాలో అక్రమాలు జరిగితే ఓ ఆర్డీవో స్థాయి అధికారి కౌంటర్ ఇవ్వడానికి కూడా జంకుతుండటం అనుమానాలకు తావిస్తున్నది. ఎవరి మెప్పు కోసం సదరు ఆర్డీవో ఈ కౌంటర్ పంపారు? కనీసం సంతకం లేకుండా పంపడం వెనుక ఉద్దేశమేమిటో తెలియాల్సి ఉన్నది. కాగా, పొలిటికల్ ప్రెజర్ వల్లే అఫీషియల్‌గా కౌంటర్ ఇవ్వడం లేదని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ అధికారి వెల్లడించారు.
అధికార పార్టీ నేతల వల్లే అక్రమాలు
అధికార పార్టీ నేతల అండదండలతోనే భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని కొంతమంది అధికారులు విజిలెన్స్ బృందానికి మొరపెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ సాగుతుండటంతో ఓ ఎమ్మెల్యే పీఏ, మామ మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. అక్రమాలకు సహకరించని చాలామందిని బదిలీలు కూడా చేయించారని, మరికొందరిని బెదిరించారని కూడా తెలుస్తున్నది. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీని బజారున నిలబెట్టి ఓటమికి కారణమయ్యారని కొందరు కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడం పార్టీ వర్గాల్లో కలవరం పుట్టిస్తున్నది.