హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించడంలో కుట్ర కోణం దాగి ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. తెలంగాణకు తీరని నష్టం కలిగించి గోదావరి జలాలను ఏపీకి దోచిపెట్టేందుకే ఈ దుర్మార్గానికి ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కుట్రకోణం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు హస్తం ఉన్నదని మండిపడ్డారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిన వెంటనే రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమ్మక్కయి విషం చిమ్మారని దుయ్యబట్టారు. ఆగమేఘాలపై లేఖ రాసి ఎన్డీఎస్ఏను రప్పించారని విమర్శించారు. ఘోష్ కమిషన్ ముసుగులో ఇప్పుడు నయా నాటకాలకు తెరతీశారని నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చారని తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఘోష్ కమిషన్ కాంట్రాక్టర్ల నుంచి రూ.6 కోట్లు రికవరీ చేయాలని చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన చీఫ్ ఇంజినీర్లు, అధికారులపై రేవంత్‌రెడ్డి ఏసీబీ కేసులు పెట్టి బెదిరింపులకు దిగారని విమర్శించారు. కాళేశ్వరానికి అనుకూలంగా మాట్లాడవద్దని అధికారులపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. 20వ నంబర్ పిల్లర్ గురించి అడగవద్దని కమిషన్‌కు సూచించిన విషయం వాస్తవంకాదా? అని నిలదీశారు. కాళేశ్వరంపై విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికలో 18 మంది ఇంజినీర్లపై కేసులు పెట్టాలని చెప్పారని, కానీ ప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందని మండిపడ్డారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరంపై మహదేవ్పూర్ ఠాణాలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేగానీ రాజకీయ లబ్ధికోసం కేసీఆర్‌ను బద్నాం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని హితవు పలికారు.
సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ ప్రభుత్వాన్ని వదిలి ప్రతిపక్షంపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. మతిభ్రమించి ఆయన అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. ఆయన మాటలు వింటే డాక్టరేట్‌పై అనుమానం ఉన్నదని ఎద్దేవా చేశారు. హరీశ్‌బాబు సిర్పూర్లో హాస్పిటల్ పెట్టి పేదలను నిలువు దోపిడీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రేవంత్ సర్కారు ప్రజాసమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధిని చూపడం లేదని విమర్శించారు. యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న వారిపై చర్యలు చేపట్టడంలేదని ఆక్షేపించారు. అమృత్ టెండర్ల స్కాంపై కేటీఆర్ ఆధారాలతో కేంద్రానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. రేవంత్‌తో మిలాఖత్ కావడం వల్లే పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్మూధైర్యం ఉంటే యూరియా బ్లాక్ మార్కెట్‌పై సిట్ వేయాలని, కోడిగుడ్ల కుంభకోణం, డీపీఆర్ లేకుండా నిర్మిస్తున్న కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కాంలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పెద్దలు కలిసి బీఆర్ఎస్ను నాశనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆర్ఎస్పీ ధ్వజమెత్తారు. సీబీఐ, ఈడీ, ఐటీలను అడ్డంపెట్టుకొని తెలంగాణను సాధించిన కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. మోదీ, చంద్రబాబుల ఎజెండాను సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తూ తెలంగాణ హక్కులను కాలరాస్తున్నారని విరుచుకుపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ వెన్నుచూపదని, రెండు పార్టీల పన్నాగాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతుందని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి చిల్లర ప్రయత్నాలను పక్కనబెట్టి పాలనపై దృష్టిపెట్టాలని హితవుపలికారు. లేదంటే తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెప్తుందని హెచ్చరించారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఇంతియాజ్ అహ్మద్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, నాయకులు ఆజంఅలీ, అభిలాష్ రంగినేని పాల్గొన్నారు.