కోదాడ, జూన్ 14 : ‘సర్’ ముసుగులో ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతున్నదని, రాజ్యాంగానికి బీజేపీ నిర్వాకంతో పెనుప్రమాదం సంభవించనున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోనే రాష్ట్ర పురోగతి సాధ్యమని చెప్పారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రత్యేక ఓటర్ జాబితా, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇప్పటివరకు ఐదు రాష్ర్టాల్లో ‘సర్’ ప్రక్రియ జరిపి పశ్చిమ బెంగాల్, కేర ళ, పాండిచ్చేరి, తమిళనాడులో లక్షల ఓట్లను తొలగిం చారని, బీజేపీ అధికారంలో ఉన్న అస్సాంలో ‘సర్’ ప్రక్రియను నిర్వహించలేదని ఆరోపించారు.
2028లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రభు త్వాలు ‘సర్’ పేరుతో బీఆర్ఎస్ ఓట్లను తొలగించేందుకు కుతంత్రం చేస్తున్నాయని మండిపడ్డారు. 2018-2019లో ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ సేవామిత్ర మొబైల్ యాప్ ద్వారా వైఎస్సార్ పార్టీకి సంబంధించిన ఓట్లను తొలగించిందని చెప్పారు. తెలంగాణలో కూడా ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి చంద్రమిత్ర యాప్ తీసుకొచ్చి బీఆర్ఎస్ ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని తెలిపారు. దీనిపై బీఎల్ఏలు అప్రమత్తతతో ఉండాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో 20 వేల దొంగ ఓట్లతోనే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని ఆరోపించారు.
‘సర్’ ప్రక్రియతో 90 లక్ష ల ఓట్లు తొలగించి.. పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీని, తమిళనాడులో 20 లక్షల ఓట్లు తొలగించి.. డీఎంకే పార్టీని ఓడించారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభ కోణాల మయమని చెప్పారు. నార్దాబుల్, కొత్వాల్‌గూడ, మైనింగ్, ఫ్యూచర్‌సిటీ, గురుకులాల విద్యార్థులకు ఇచ్చే ప్లేట్లు, యూనిఫామ్స్, దుప్పట్ల పంపిణీలో కూడా కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
గురుకులాల టెండర్లలో సెంట్రలైజ్డ్ టెండర్ల పేరిట రూ.3 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడేందుకే జీవో 17ను తీసుకొచ్చారని తెలిపారు. ఆర్ఆర్బీ, టెట్ ఒకే రోజు ఉన్నందున టెట్‌ను వారం రోజులు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన వహించిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య, సభ్యత్వ నమోదు ఇన్చార్జి తిప్పన విజయసింహారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.