హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన కాదని, ప్రజా పీడన అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని, రూ.15 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారిక సభలు పెట్టి కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను తిట్టేందుకే వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి భాష డ్రైనేజీని తలపిస్తున్నదని, అంబర్‌పేట సభలో ఆయన మరోసారి మురికి భాష మాట్లాడారని ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, ఆయన తెలంగాణ పాలిట నంది అని స్పష్టంచేశారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని కాంగ్రెస్ పందికొకులు, రాబందులు బందీ చేశాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ పిలుపుమేరకు నిరసనలు సాగుతున్నాయని, కాంగ్రెస్ నేరస్తులపై ప్రజల పక్షాన నేడు చార్జ్‌షీట్ వేస్తున్నామని, కాంగ్రెస్ దొంగల బాగోతాలను బయటపెడుతామని హెచ్చరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్-19 ప్రకారం నిరసన తెలిపే హకు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల ద్వారా ప్రతిపక్షాల గొంతు నొకుతున్నదని ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మిర్యాలగూడలో కేటీఆర్ సభకు అనుమతి ఎందుకు నిరాకరించారో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మతపరమైన ఊరేగింపులు లేకపోయినా సెక్షన్-30 ఎందుకు అమలుచేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో గత 33 నెలలుగా అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతున్నదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి భాషతో రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతున్నదని ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్న సీఎం రేవంత్‌కు ప్రవీణ్‌కుమార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్రస్తుతం ‘కేసీఆర్ 3.0’ కోసం వ్యూహరచన చేస్తున్నారని, ప్రజాసంక్షేమం కోసం నిరంతరం ఆయన మేధోమథనం చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టంచేశారు. రాహుల్, సోనియాగాంధీలు పార్లమెంట్‌కు ఎన్నిసార్లు హాజరవుతున్నారో ముందుగా వారిని ప్రశ్నించాలని హితవు పలికారు. తెలంగాణను మళ్లీ ఎలా బాగు చేయాలో కేసీఆర్ ఆలోచిస్తున్నారని, రాబోయే ‘కేసీఆర్ 3.0’ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రవీణ్‌కుమార్ స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి మెప్పు కోసం ఫోన్ ట్యాపింగ్ కేసులో కక్ష సాధింపునకు పాల్పడే అధికారులకు కేసీఆర్ 3.0 పాలనలో శిక్షలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రామచంద్రనాయక్, పల్లె రవికుమార్, గాంధీనాయక్, నేతలు రామ్మూర్తి, రమాదేవి పాల్గొన్నారు.