హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఫార్ములా ఈ-కార్ రేస్‌లో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదుపై ఐపీఎస్ మాజీ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పందించారు. ఐపీఎస్ మాజీ అధికారిగా ఈ కేసుపై తన ఎక్స్ ఖాతాలో ఆయన కొన్ని ముఖ్యమైన వాఖ్యలు చేశారు. ‘నేను రెండేండ్లు హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో ఆర్థిక నేరాలను పరిశోధించాను. అదే అనుభవంతో కేటీఆర్ మీద ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ 14/2024 లోని అన్ని వివరాలను లోతుగా పరిశీలించాను. ప్రపంచంలో ఇంత తుఫైల్ (వరెస్ట్) కేసు ఇంకొకటి ఉండదు. గమ్మత్తేందంటే ప్రస్తుత పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో ఇప్పించిన ఫిర్యాదులో ఎకడా సదరు రూ.55 కోట్ల నుంచి ఒక పైసా కూడా కేటీఆర్ జేబుల్లోకి వెళ్లినట్టు నిరూపించలేక పోయారు. పాపం ఆరు నెలలు శ్రమించారు కదా ! ప్రజలు మీకిచ్చిన విలువైన సమయాన్ని నీటిపాలు చేశారు. ఆ మాటకొస్తే అరవింద్ కుమార్ ఐఏఎస్, చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి మీద కూడా అవినీతి జరిగినట్టు ఈ ఫిర్యాదులో నిరూపించలేకపోయారు. మీరు చూపించగలిగిందంతా ప్రొసీజర్ ఉల్లంఘనలు మాత్రమే! వీటికి శాఖా పరమైన ఎంక్వైరీ వేసి నిజమేందో తెలుసుకుంటే సరిపోయేది. అది ఇప్పటికే జరిగింది. సచివాలయంలో ఇలాంటి ప్రొసీజర్ ఉల్లంఘనలు ప్రతి డిపార్ట్మెంట్లో రోజూ జరుగుతుంటయి.
అట్ల చేయకపోతే అనుకున్న లక్ష్యం నెరవేరదు. ప్రజలు ఇబ్బంది పడుతరు. వీటిని తర్వాత క్యాబినెట్లో పెట్టి క్రమబద్ధీకరిస్తరు. వీటి మీద స్పష్టత లేని వాళ్లకు ప్రతిదీ వయలేషన్ లాగానే కనిపిస్తది. ఇందులో రూ.55 కోట్లు ఖర్చుపెట్టింది కూడా రాష్ర్టానికి వందల కోట్ల రాబడి రావడం కోసమే.. మీకేమైనా అనుమానాలుంటే అన్నీ అసెంబ్లీ సాక్షిగా నివృత్తి చేస్తామని కేటీఆర్ అంటున్నా ముఖం చాటేసి పిరికిపందల్లా ఏసీబీకి ఫైలు అప్పగించారు. అసలు ఈ విషయంలో ప్రభుత్వ ఖజానాకు ఏమైనా నష్టం జరిగిందంటే అది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్లనే. ఎవరినడిగి మీరు ఫార్ములా-ఈ అగ్రిమెంట్‌ను రద్దుచేశారు? మీరు ముందు నిపుణుల కమిటీతో చర్చించారా? దీనిపై క్యాబినెట్ అనుమతి తీసుకున్నారా? మీ వల్లే తెలంగాణకు వచ్చే వందల కోట్ల రాబడి ఆగిపోయింది. మన నగరానికొచ్చే ఫార్ములా ఈ రేసింగ్‌ను పక రాష్ట్రం కర్ణాటక తన్నుకు పోయింది. అసలు ఈ ఫార్ములా ఈ-కేసులో ఏ1 కేటీఆర్ కాదు.. ముమ్మాటికీ రేవంత్‌రెడ్డే! అసలు నేడు తెలంగాణ ఖజానా ఖాళీగా ఉండటానికి కారణం రేవంత్‌రెడ్డి. ఆయనను మళ్లీ జైలుకు పంపిస్తేనే తెలంగాణ మళ్లీ పరుగులు పెడ్తది. ఇదే నిప్పులాంటి నిజం. దాచేస్తే దాగని సత్యం’ అని ఆర్ఎస్స్పీ స్పష్టంచేశారు.