RSP | షాద్‌నగర్, ఆగస్టు 5: ఓ దళిత మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నదని, రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేకుండా పోయిందని, అంతా లాఠీ పోలీసింగే రాజ్యమేలుతున్నదని, శాంతిభద్రతలపై ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధలేదని, ఏ నేరం జరిగినా చర్యలు లేవని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. షాద్‌నగర్ పట్టణంలోని సర్కారు దవాఖానలో చికిత్స పొందుతున్న దళిత మహిళ సునీతను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, సురభి వాణిదేవి, మాజీ ఎమ్మెల్యే వై అంజయ్యయాదవ్, మాజీ ఎంపీ మంద జగన్నాథం, జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ ఈటె గణేశ్‌తో కలిసి సోమవారం పరామర్శించారు.
పోలీసులు ప్రవర్తించిన తీరుపై బాధిత మహిళను అడిగి తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు. అనంతరం సబిత దవాఖాన ఆవరణలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు, లైంగికదాడులు, దోపిడీలు తప్ప ప్రజలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. గత ప్రభుత్వం పోలీసులు, ప్రజలను సమన్వయం చేసుకుంటూ సేవలందించిందని, ఇప్పుడవి కనుమరుగయ్యాయని తెలిపారు. మహిళ అని చూడకుండా ఇష్టంవచ్చినట్టు కొట్టడం బాధాకరమని, పోలీసుల థర్డ్ డిగ్రీని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దళిత మహిళను కొట్టిన పోలీస్ అధికారులను, సిబ్బందిని వెంటనే విధులనుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు.
సీఎం అండతో పోలీసుల ఇష్టారాజ్యం: ఆర్ఎస్పీ
దొంగతనం నెపంతో షాద్‌నగర్‌కు చెందిన దళిత మహిళ సునీతను పోలీసులు ఇష్టంవచ్చినట్టు కొట్టడం బాధాకరమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. మహిళా అని చూడకుండా ఆమె రొమ్ముళపై పోలీసులు కాళ్లతో తన్నడం తీవ్రంగా కలిచివేసిందని, పోలీసులకు ఈ అధికారం ఎవ్వరిచ్చారని మండిపడ్డారు. నాలుగు రోజుల పాటు మహిళను ఇష్టానుసారం విచారణ పేరుతో కొడుతుంటే డీసీపీ, ఏసీపీ ఏం చేశారని ప్రశ్నించారు. మహిళలను రాత్రివేళ విచారించడం సరికాదనే విషయం పోలీసులకు తెలియదా? అని, విచారణ పేరుతో మహిళను, ఆమె భర్తను, కొడుకును దారుణంగా కొట్టడం నేరంకాదా? అని నిలదీశారు.
సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముళ్ల కాన్వాయ్‌లకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు, సామాన్యులకు మాత్రం రక్షణ కల్పించడం లేదని, రేవంత్‌రెడ్డి అండతోనే పోలీసులు రెచ్చిపోతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అవమానాలకు గురవుతున్నా సీఎం స్పందించడం లేదని విమర్శించారు. అసెంబ్లీలో మహిళా ప్రజాప్రతినిధులను స్వయంగా ముఖ్యమంత్రే అవమానించేలా వ్యవహరిస్తే ఇక రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదన్నారు. దళిత మహిళ సునీతకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో 40 వేల మంది పోలీసులను నియమించడంతో పాటు 11 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి శాంతిభద్రతలను బలోపేతం చేస్తే, నేటి సీఎం లా అండ్ ఆర్డర్‌ను నీరుగారుస్తున్నారని దుయ్యబట్టారు. అశ్వరావుపేట ఎస్ఐ పురుగుల మందు తాగి చనిపోయినా, భూపాలపల్లి ఎస్ఐ తోటి మహిళా కానిస్టేబుల్‌పై లైంగికదాడి చేసినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని విమర్శించారు. షాద్‌నగర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
జడ్జిలే ఆశ్చర్యపోయేలా పోలీసుల తీరు: మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
పోలీసుల తీరుతో న్యాయమూర్తులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్యయాదవ్ చెప్పారు. షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన పోలీసులు నమోదు చేసిన కేసులను చూసి జడ్జి ఆశ్చర్యపోయారని గుర్తుచేశారు. పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు. సునీతకు అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్, నాయకులు లక్ష్మణ్‌నాయక్, బీష్వ రామకృష్ణ, ప్రతాప్‌రెడ్డి, ఒగ్గు కిశోర్, అడ్డు, చెట్ల నర్సింహ, శివ, దినేశ్‌సాగర్ పాల్గొన్నారు.
పోలీస్స్టేషన్లలో సెటిల్మెంట్లు: ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి
పోలీస్ స్టేషన్లలో రౌడీషీటర్లకు ఉన్న ప్రాధాన్యత సామాన్యులకు లేదని, నందిగామ పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లు విచ్చలవిడిగా సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజకీయ ఒత్తిళ్లతో ప్రజలపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదుచేస్తున్నారని ఆరోపించారు. పోలీస్స్టేషన్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాలని, పేదలకు న్యాయం జరిగేలా పోలీసుల పనితీరు ఉండాలని సూచించారు. దళిత మహిళపై పోలీసుల థర్డ్‌డిగ్రీ దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు.