కాగజ్‌నగర్, జూలై 17 : కాంగ్రెస్ నాయకులకే యూరియా బస్తాలు ఇస్తారా.. పేద రైతులకు ఇవ్వరా…అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మార్కెట్ యార్డులోని రైతులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో పేద రైతులకు యూరియా అందడంలేదని, కాంగ్రెస్‌కు చెందిన దళారులు యూరియా తీసుకొని బ్లాక్‌లో ఎక్కువ ధరకు అమ్ముతూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు.
యూరియా కోసం వర్షంలో సైతం మహిళా రైతులు క్యూలో పడిగాపులు కాస్తుంటే, కాంగ్రెస్ దళారులు యూరియా దందా చేస్తున్నారని మండిపడ్డారు. బస్తాకు రూ.265 ఉంటే బ్లాక్‌లో రూ.400 చొప్పున అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యవసాయ అధికారులు, కలెక్టర్ రైతుల సమస్యలపై స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో విత్తనాలు పెట్టే సమయానికే రైతులకు సరిపడా యూరియా అందించేవారని గుర్తుచేశారు.