హైదరాబాద్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): నిబద్ధత కలిగిన ఐపీఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ప్రభుత్వం అవమానించింది. సీనియర్, మాజీ ఐపీఎస్ అధికారిగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి రావాలని ఆహ్వానం పంపించి.. ఆ కార్యక్రమానికి హాజరుకాకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీనిపై సోమవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పరేడ్‌కు ఆహ్వానించి, రాత్రి నుంచే గృహనిర్బంధంలో ఉంచారు తెలంగాణ డీజీపీ గారు.
విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసు సోదరులకు నివాళులు అర్పించే అర్హత నాకు లేదా? నేనేమైనా టెర్రరిస్టునా? సీఎం రేవంత్‌రెడ్డి గారు, మేమంటే ఎందుకింత భయపడుతున్నారు? ఎన్నాళ్లీ అరాచకాలు?’ అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా హౌస్ అరెస్టు చేసిన ఫొటోలు, ఇంటి ఎదుట రాత్రింబవళ్లూ పహారాలో ఉన్న పోలీసుల ఫొటోలను, పోలీసు శాఖ నుంచి వచ్చిన ఆహ్వాన ప్రతులను షేర్చేశారు. పోలీసుల అవమానకరమైన ప్రవర్తనపై నెటిజన్లు రీ ట్వీట్లు, కామెంట్లతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఇదెక్కడి దుర్మార్గం?: కేటీఆర్
మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అక్రమ హౌ స్ అరెస్ట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ స్పం దించారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ‘మా నాయకుడు అడిషనల్ డీజీ ర్యాంకు కలిగిన అధికారి. పోలీసు సేవల్లో ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నారు. పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించేందుకు ఆహ్వానించి.. వారే ఆయన్ని హౌస్ అరెస్టు చేశారు. ఇదీ వీరి గొప్పతనం. ఇంతకంటే ఏం చెప్పాలి. ఇదెక్కడి దుర్మార్గం.’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.
ఆహ్వానించి అరెస్టు చేస్తారా? : హరీశ్‌రావు
బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అక్రమ అరెస్టును మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ‘ఆహ్వానించింది మీరే.. అరెస్టు చేసింది మీరే.. ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని పోలీసు అమరవీరుల దినోత్సవం రోజే అవమానించడం సిగ్గుచేటు. పోలీసులపై మీ కపట ప్రేమకు ఇది మరో నిదర్శనం రేవంత్‌రెడ్డి గారు. ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు ప్రభుత్వాలు పనిచేయాలి గానీ, ఇలా నిర్బంధాల పాలన చేయడం దుర్మార్గం.’ అని ఎక్స్‌లో తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేశారు.