ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి విషయాన్ని పసిగట్టడంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏంచేస్తున్నది? స్పెషల్ బ్రాంచి ఎటుపోయింది? అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి అనంతరం సైబరాబాద్ సీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోనే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి తెగబడ్డారని స్పష్టంచేశారు. 20 కిలోమీటర్ల దూరం నుంచి ఎమ్మెల్యే గాంధీ తన అనుచరులు, గూండాలు ర్యాలీగా వస్తుంటే పోలీసులు ముందస్తు అరెస్టులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
దాడిని నివారించేందుకు బాష్పవాయు ఎందుకు ప్రయోగించలేదు? ఎందుకు బలగాలను మోహరించలేదు? 20 కి.మీ. పరిధిలో ఎన్ని పోలీసులు స్టేషన్లు ఉన్నాయి? ఎందుకు అరెస్టు చేయలేదు? ఇదంతా సీఎంకు తెలియకుండానే జరిగిందా? అని ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే సీఎం ఎందుకు భయపడుతున్నాడో చెప్పాలని కోరారు. రాష్ట్రంలో పాలన పడకేసి దోపిడీ జరుగుతుందని, ఆ దోపిడీని ప్రశ్నించేవారిపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.
దాడులకు సీఎం రేవంత్ ప్రోత్సాహం
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి సహా ఇటీవల బీఆర్ఎస్ నేతలపై వరుస దాడులకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్సాహం ఉన్నదని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి విమర్శించారు. సైబరాబాద్ సీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. నెలరోజుల వ్యవధిలోనే హరీశ్‌రావు క్యాంపు ఆఫీసుపై, ఖమ్మంలో, నల్లగొండలో మాజీ ఎమ్మెల్యేలపై, ఇప్పుడు కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాలు దాడులకు తెగబడ్డారని తెలిపారు. ఇట్లాంటి ఘటనలతో పోలీసులపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని చెప్పారు. మా ఓపికను పరీక్షించకండి.. తెలంగాణ ప్రశాంతంగా ఉండేందుకు మేము కట్టుబడి ఉన్నాం.. మా మరో ముఖం చూడొద్దు’ అని హెచ్చరించారు.
మహిళలను దుర్భాషలాడిన గాంధీపై చర్యలు తీసుకోవాలి
మహిళలను కించపరిచేలా దుర్భాషలాడిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. తల్లిని అవమానించేలా పదే పదే ఎమ్మెల్యే గాంధీ తీవ్ర దుర్భాషలాడారని, ఇప్పుడు మహిళా కాంగ్రెస్ నాయకులు ఎకడికి పోయారు? అని ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డిపై కొందరు ఆంధ్రా గూండాలు పకా ప్రణాళికతో దాడికి యత్నించారని ధ్వజమెత్తారు. గత పదేండ్లలో ఎన్నడూ ఇలాంటివి తెలంగాణలో జరగలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇలాంటి దుర్మార్గాలను, గూండాగిరిని చూస్తున్నామని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఆజ్యం
సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఆజ్యం పోస్తున్నాడని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. విధ్వంసం, వినాశనం, అరాచకమే కాంగ్రెస్ ప్రభుత్వ మూల సూత్రాలు అని పేర్కొన్నారు. పదేండ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో 10 నెలలు గడవకముందే మళ్లీ పాత రోజులను తెచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.