చింతలమానేపల్లి/కాగజ్‌నగర్/కౌటాల, ఏప్రిల్ 9 : కాంగ్రెస్ సర్కార్ రైతులను వేధిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. కేసీఆర్ సర్కారు పోడు భూములకు పట్టాలిస్తే.. వాటిలో సాగు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని అన్నారు. బుధవారం ఆయన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కర్జెల్లి, గంగాపూర్, బూరెపల్లి, సిర్పూర్(టీ) మండలం డొర్పల్లి, కౌటాల మండలం పార్డీ గ్రామాల్లో పర్యటించారు.
పలుచోట్ల రైతులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులతో సమావేశమయ్యారు. కర్జెల్లి, గంగాపూర్, దిందా, కేతిని, గూడెం, కోర్సిని తదితర గ్రామాల్లో పట్టా భూముల్లో వ్యవసాయ పనులకు వెళ్తే నోటీసులు ఇస్తామంటూ అటవీ అధికారులు బెదిరిస్తున్నారని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన పోడు పట్టా భూముల్లో సైతం వ్యవసాయం చేసుకోకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రైతులు భయాందోళనలు చెందొవద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ భరోసా ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు రైతులను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. కాగా కర్జెల్లిలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన 50 మంది, డోర్పల్లిలో కాంగ్రెస్ నాయకుడు దుర్గం మధుకర్, పార్డీ గ్రామంలో 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా.. ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.