హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు జీతాలు ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. నెలల తరబడి పనులు చేయించుకుంటూ తగిన వేతనం ఇవ్వకపోవడం ముమ్మాటికీ బానిసత్వానికి సమానమని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు.
‘కొత్తగా నియామకమైన ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఏడాది కాలంగా జీతాలు లేకుండా వేరే స్టేషన్లో అటాచ్‌మెంట్‌పై పనిచేస్తున్నారు. జీతం లేకుండా పనిచేయడం బానిసత్వానికి సమానం. ట్రెజరీ నుంచి జీతాలు తీసుకోవడానికి ప్రభుత్వ ఉత్తర్వును సూపర్‌న్యూమరీ పోస్టులకు ఇచ్చారు. ఈ సమస్యకు పరిషారం కనుగొనడానికి అధికారులెవరూ ఆసక్తి చూపడంలేదు.
ఎక్సైజ్ శాఖకు రూ.10,000 కోట్ల ఆదాయం వస్తున్నది. అయినా సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి ఈ సమస్యను పరిషరించడంలో ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే వారు భూకబ్జా ద్వారా తమ వ్యక్తిగత సంపదను పెంచుకోవడంలో బిజీగా ఉన్నారు’ అంటూ ‘ఆరు నెలలైనా జీతాల్లేవు’ అంటూ ‘నమస్తే తెలంగాణ’ రాసిన వార్తా కథనాన్ని పోస్ట్‌కు అటాచ్ చేశారు.