హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి పాలనలో విద్యారంగం సర్వనాశనమైందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‌లోని ఒక పాఠశాలలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయంటూ మోదీకి లేఖ రాసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. తెలంగాణలోని స్కూళ్ల దుస్థితి గురించి కూడా ప్రధానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. బీహార్ కన్నా.. తెలంగాణ పాఠశాలల్లో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రహారీ గోడలు, మరుగుదొడ్లు లేకపోవడంతో బాలికలు నానా ఇబ్బందులు పడుతున్నారని, తరగతి గదుల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ విషయంలో రాహుల్‌గాంధీ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ ఒక వెలుగు వెలిగిందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్రంలో మొత్తం 300 గురుకులాలు ఉంటే, కేసీఆర్ సీఎం ఆయిన తర్వాత అదనంగా 660 గురుకులాలు ఏర్పాటుచేశారని వివరించారు. వాటితోపాటు సైనిక్‌స్కూళ్లు, లా, ఫార్మసీ, ఫ్యాషన్ టెక్నాలజీ వంటి కాలేజీలు ఏర్పాటుచేయడంతోపాటు అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి 20 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాలకు పంపించిన చరిత్ర కూడా కేసీఆర్‌దేనని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ లేకుండా విద్యార్థులు ఏఐ ఎట్లా నేర్చుకుంటారని ఆయన ప్రశ్నించారు.
పాఠశాల విద్యార్థుల కోసం కేసీఆర్ బ్రేక్‌ఫాస్ట్, మౌలిక వసతుల కోసం ‘మనఊరు-మనబడి’ పథకం ద్వారా రూ.17వేల కోట్లతో 28 వేల స్కూళ్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే.. కాంగ్రెస్ సర్కారు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని ప్రవీణ్‌కుమార్ చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని, విద్యారంగాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫొటోషాప్ ప్రభుత్వంగా మారిందని ఎద్దేవా చేశారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులు ప్రారంభం కాలేదని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలోని ఇంటిగ్రెటెడ్ స్కూల్లో కూడా ఒక్క ఇటుకను కూడా వేయలేదని దుయ్యబట్టారు. ఇవన్నీ రాహుల్‌గాంధీకి కనిపించడం లేదా? అని నిలదీశారు.
స్కూళ్లలో శానిటేషన్ దారుణంగా ఉన్నదని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. విద్యార్థులే.. ఎవరి టాయిలెట్లు వారు కడుక్కోవాలని ఒక ఐఏఎస్ అధికారి అనడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆ ఐఏఎస్‌కు నోటీసులు ఇచ్చిందని తెలిపారు. సర్దుబాటు పేరుతో రాష్ట్రంలో అనేక స్కూళ్లను మూసి వేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ నాయకులు నాయిని రాజేందర్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, అది మంచిది కాదని హెచ్చరించారు. తాము వారి మాదిరిగా సచివాలయంలో కూర్చొని కమీషన్ల కోసం ఆరాటపడటం లేదని, ఢిల్లీకి మూటలు మోసే సంస్కృతి బీఆర్ఎస్కు లేదని స్పష్టంచేశారు.