RS Praveen Kumar | రాజాపేట, డిసెంబర్ 3 : సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో మంది పేద విద్యార్థులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఆయన లోపలికి రాకుండా పాఠశాల గేటుకు తాళం వేశారు. దాంతో స్కూల్ గేటు ముందు కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో గురుకులాలు స్వర్ణయుగంలా కొనసాగిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నాయకులను నిర్బంధించినంత మాత్రాన పోరాటం ఆగదని హెచ్చరించారు.
గురుకులాల్లో దుర్మార్గంగా ఆంక్షలు విధించడం సిగ్గుచేటని అన్నారు. ఫుడ్ పాయిజన్‌తో రాష్ట్రంలో 48 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు రేవంత్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 11 నెలల పాలనలో గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మధ్యా హ్న భోజనం తినే విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గురుకులాల్లో విద్యార్థులకు కనీసం నీటివసతి కూడా లేదని, నాణ్యమైన భోజనం అందించడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా ఆలేరు పట్టణ కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఆయన వెంట డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు తుంగ బాలు, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆంజనేయులుగౌడ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఉన్నారు.