కాగజ్‌నగర్, జనవరి 20: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, అరాచకాలపై ప్రశ్నించినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామంలోని స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తేనే ప్రభుత్వానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులకు నోటీసులివ్వాలని గుర్తొస్తుందని ఎద్దేవాచేశారు. ఫోన్‌ట్యాపింగ్ కేసును హైకోరు కొట్టివేసిందని, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే దాన్ని కూడా సుప్రీం కోర్టు కొట్టేసిందని తెలిపారు. హరీశ్‌రావుపై ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడలేదని, ఇపుడు పెట్టే తుఫేల్ కేసులకు కూడా భయపడబోరని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసులకు దమ్ముంటే సృజన్‌రెడ్డి, రోహిన్‌రెడ్డి కుంభకోణాలపై, ఎన్టీవీ, ఏబీఎన్ యజమానులపై, 120 మంది గురుకుల విద్యార్థుల మరణంపై, షాబాద్‌లో పేదల భూములను ఆక్రమించుకోవడంపై సిట్ వేయాలని డిమాండ్‌చేశారు.
బొగ్గు బ్లాక్‌లో సైట్ విజిట్ నిబంధన తొలగించాలి
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే సింగరేణి సంస్థలో అవినీతి విచ్చలవిడిగా పెరిగింది. నైని బ్లాక్‌లో ‘ఎండీవో’ నిబంధన తెచ్చి బొగ్గు ఉత్పత్తి సైతం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సరికాదు. ఈ వ్యవహారంలో వేల కోట్లు దండుకోవడానికి చేసిన ప్రయత్నాలను తిప్పి కొట్టినా మళ్లీ టెండర్లు కొనసాగించే అవకాశమున్నది. సైట్ విజిట్ నిబంధన, బొగ్గు బ్లాక్‌ల వేలం రద్దు చేయాలి. సంస్థలో అవినీతి, అక్రమాలపై టీబీజీకేఎస్ నిరంతరం పోరాడుతుంది.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు సిస్టమేటిక్ కరప్షన్
కంపెనీగా సింగరేణి
ఎస్సీసీఎల్ అంటే సిస్టమేటిక్ కరప్షన్ కంపెనీగా మారింది. నైని బ్లాక్‌లో సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేయాలి. అవసరమైతే ఒడిశా రాష్ట్రంలోని నైని బొగ్గు బ్లాక్‌కు భూములు ఇచ్చి, నష్టపోయిన కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చి వారితో బొగ్గు ఉత్పత్తి చేయించాలి. సంస్థలో అన్ని ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఓవర్ బర్డెన్ కాంట్రాక్టర్లు అవినీతి అక్రమాలు చేస్తూనే ఉన్నారు. సంస్థలో అవినీతి, అక్రమాలను హెచ్ఎంఎస్ అడ్డుకుంటుంది.
– రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి
ప్రైవేట్‌కు ఇస్తే తీవ్ర పరిణామాలు
బొగ్గు ఉత్పత్తిని ప్రైవేట్‌కు అప్పగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. నైనీ బ్లాక్‌లో ఎండీవో ద్వారా నిబంధనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా ఉన్న సింగరేణి.. గడిచిన పదిహేనేండ్లలో రాయల్టీ, డివిడెండ్ల రూపంలో రూ.80వేల కోట్లు చెల్లించింది. లాభాల బాటలో ఉన్న సంస్థను నిర్వీర్యం చేస్తున్నది. రూ.50వేల కోట్ల బకాయిలు ఇవ్వనందున బ్యాంకుల నుంచి సంస్థ అప్పులు తెచ్చి జీతాలు చెల్లించే పరిస్థితి దాపురించింది. సంస్థలో అవినీతి కుంభకోణాలపై అన్ని కార్మిక సంఘాలతో జేఏసీగా ఏర్పడి ఆందోళనలు చేపడుతాం. సర్కార్ విధానాలను ఎండగడుతాం.
– మంద నరసింహారావు, సీఐటీయూ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు