హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గురుకులాలు, అంగన్వాడీలు, హాస్టళ్లకు కోడిగుడ్ల సరఫరా టెండర్లలో కాంగ్రెస్ నేతలు రూ. 600 కోట్ల కుంభకోణానికి తెరలేపారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బడా కాంట్రాక్టర్ల మేలు కోసమే ప్రభుత్వం జీవో 17 జారీ చేసిందని విమర్శించారు. జీవోలో బడాబాబులకు అనుకూలంగా నిబంధనలు పొందుపర్చినట్టు తెలిపారు. మండలం యూనిట్‌గా కాంట్రాక్టర్ల ఎంపిక, ఈఎండీ, టర్నోవర్ ఫీజులు, అప్లికేషన్ రుసుంను భారీగా పెంచడం కుంభకోణంలో భాగమేనని చెప్పారు. కోడిగుడ్ల సరఫరాలో గోల్మాల్ ఆరోపణల నేపథ్యంలో మంగళవారం తెలంగాణ భవన్లో చిన్న కాంట్రాక్టర్లు తరలివచ్చారు. కాంగ్రెస్ నేతలు కుంభకోణానికి కుట్ర పన్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కు వివరించారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ విలేఖరుల సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ అంటేనే కమీషన్ల పార్టీ అని, రేవంత్ సర్కార్.. కుంభకోణాలకు కేరాఫ్‌గా మారిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు బీజేపీ వంతపాడుతున్నదని నిప్పులుచెరిగారు. ప్రభుత్వ పెద్దలు 20 వేల మంది చిన్న కాంట్రాక్టర్లకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను పదేండ్లపాటు పాలించిన కేసీఆర్… సంపదను పెంచి, పేదలకు పంచారని కొనియాడారు. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం నిరుపేదలకు అన్యాయం చేస్తూ పెద్దోళ్లకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు.
కుంభకోణం వెనుక కాంగ్రెస్ సీనియర్‌నేత జానారెడ్డి, ఎంపీ రఘువీర్‌రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ఎస్సీలకు అన్యాయం జరుగుతుంటే మంత్రులు భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ ఏం చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. జీవో 17ను వెంటనే రద్దు చేయాలని, లేదంటే బీఆర్ఎస్ నేతృత్వంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు దిగుతామని, న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
మేం చిన్న వ్యాపారులం. గతంలో మా శక్తి మేరకు రెండు, మూడు స్కూళ్లకు కిరాణా సామగ్రిని సరఫరా చేసేవాళ్లం. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్ల దాఖలుకు అడ్డదిడ్డమైన రూల్స్ తెచ్చింది. మండలంలోని స్కూళ్లు, హాస్టళ్లకు సామగ్రి సరఫరాకు సంవత్సరానికి రూ.3 కోట్ల టర్నోవర్ అడుగుతున్నరు. 1.20 కోట్లు చెల్లించేలా నిబంధనలు పెడుతున్నరు.
– నక్క ఆనంద్, కాంట్రాక్టర్, రంగారెడ్డి
గతంల మేం 60 గ్రాములు ఉన్న కోడి గుడ్డును రూ. 5.80 పైసల చొప్పున సరఫరా చేసేది. కానీ కాం గ్రెస్ వచ్చిన తర్వాత రూ. 40 గ్రాము లు ఉన్న గుడ్డు ధరను రూ. 6.90 పైసలకు పెంచింది. మాలాంటి చిన్న కాంట్రాక్టుల బతుకులను రోడ్డున పడేస్తున్నది.
– ఎండీ సలీమ్, కాంట్రాక్టర్, ఎర్రగడ్డ, హైదరాబాద్
కేసీఆర్ ప్రభుత్వంలో టెండర్ దరఖాస్తుకు కేవలం 500 ఉండేది. టెండర్ దక్కిన తర్వాత రూ.30 వేలు కట్టేవాళ్లం. కానీ ఇప్పుడు టెండర్ ఫారాల దాఖలుకు రూ.25 వేలు చెల్లించాలని నిబంధన పెట్టారు. టెండర్ దక్కించుకున్న తర్వాత రూ.15 లక్షలు కట్టాలని రూల్స్ తెచ్చిన్రు. ఆగస్టు 9న జీవో ఇచ్చి, ఆరు రోజుల్లోగా టెండర్లు వేయాలని చెప్తున్నరు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పేద కాంట్రాక్టర్ల పొట్టగొడుతున్నది.
-యాదయ్య, కాంట్రాక్టర్, షాద్‌నగర్