దేవరుప్పుల, డిసెంబర్ 10: ప్రభుత్వం ఆవిష్కరించిన విగ్రహం కాంగ్రెస్ తల్లిదని, తెలంగాణ తల్లి అనడం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. వట్టికోట ఆళ్వార్‌స్వామి, దాశరథి తెలంగాణ తల్లి ప్రతి రూపాన్ని తమ కవితలు, రచనల్లో తెలిపారని చెప్పారు.
దానికి అనుగుణంగా ఉద్యమనేత కేసీఆర్‌తోపాటు, ఉద్యమకారులు, కవులు, రచయితలు, కళాకారులు సమన్వయంతో తెలంగాణతల్లికి రూపకల్పన చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ గుర్తుతో రూపొందించిన ఆ తల్లి తెలంగాణ ప్రజలకు మింగుడుపడదని చెప్పారు. సంస్కృతీసంప్రదాయాలకు జీవోలు ఉండవని స్పష్టం చేశారు.