హైదరాబాద్, మార్చి 29(నమస్తేతెలంగాణ): వెన్నుపోట్లు, ద్రోహాలు, కుట్రలు, దాడులను ఎదుర్కోవటం బీఆర్ఎస్కు కొత్తేమీ కాదని, ప్రజల గుం డెల్లో బీఆర్ఎస్ స్థానం ఉన్నంత వరకు ఏమీ కాదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు విలువైన సమయాన్ని వృథా చేయకుండా, ఎంతటి త్యాగానికైనా వెనుకాడకుం డా, నమ్ముకున్న ప్రజల వద్దకు వెళ్లి, వాస్తవాలను వివరించి తెలంగాణ ద్రోహుల చెంప చెల్లుమనిపించేలా విజయభేరి మోగిద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పం దించారు. ‘కడియం శ్రీహరి, కే కేశవరావు అకస్మాత్తుగా పార్టీని వీడిన నేపథ్యంలో వారి బాటలోనే నడిచి మంచి దారి వెతుక్కోవాలని కొంతమంది, పార్టీని వీడొద్దు.. అండగా నిలబడాలని ఇంకొందరు నన్ను కోరారు. కార్యకర్తలెవరూ టెన్షన్ పడవద్దు. గెలుపుతో వచ్చే అధికార ఫలాలను అనుభవించినప్పుడు, ఓటమితో వచ్చే కష్టాలను కూడా భరించగలిగేవాడే నిజమైన పార్టీ నాయకుడు. అలా కాకుండా ప్రతి దానికి భయపడే పిరికిపందలకు బీఆర్ఎస్ లాంటి ఉద్యమ పార్టీల్లో స్థానం ఉండకూడదు. నేను గొర్రెను కాదు. కాలేను. ఇంకెకడికో పోవాలన్న ఆలోచన కూడా లేదు. ఎన్ని ప్రలోభా లు పెట్టినా పార్టీని వీడే ప్రసక్తే లేదు. నేను గతంలో చేసిన బీఎస్పీ-బీఆర్ఎస్ కూటమి ప్రయత్నమైనా, తర్వాత బీఆర్ఎస్లో చేరాలన్న నిర్ణయమై నా చాలా ఆలోచించి తీసుకున్నది.
నేను రాజకీయాల్లోకి వచ్చింది నా సొంత పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసమో, అక్ర మ ఆస్తుల కోసమో, పోలీసు కేసులకు భయపడో, హంగులు, ఆర్భాటాలున్న జీవితం కోసమో, ప్రోటోకాల్ కోసమో కాదు. నేను పుట్టి పెరిగిన సమాజం చాలా వేదనతో వెనకబడి ఉన్నది. వాళ్ల కోసం చట్టసభల్లో ఒక గొంతుకగా బతికి, వాళ్ల జీవితాలను శక్తి మేరకు సమూలంగా మార్చాలని రాజకీయాల్లోకి వచ్చా’ అని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే బహుజనవాదం, తెలంగాణవాదం రెండూ కలవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉన్నదని నమ్మినట్లు తెలిపారు. అందుకే కొత్త తెలంగాణకు బలమైన పునాది వేసిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ను ఎంచుకున్నట్టు వివరించారు. ‘దేశం లో, రాష్ట్రంలో అధికార పార్టీలు పోలీస్ కేసులు, కట్టుకథలను ఆయుధాలుగా వాడి రాజకీయ ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేయడం ప్రస్తు తం ఎదురొంటున్న అతి పెద్ద సవాల్. దీన్ని ధైర్యంగా సర్వశక్తులొడ్డి అధిగమించిననాడే దేశంలో ప్రజాస్వామ్యం నిలుస్తుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా క్షమించరాని నేరానికి పాల్పడితే వారి మీద తప్పకుండా చట్ట ప్రకారం చర్యతీసుకోవాలి. దీనిని ఎవరూ కాదనరు. కానీ వాస్తవాలను వక్రీకరించి సోషల్ మీడియా వేదికగా, అసభ్యకరమైన శీర్షికలతో రాజకీయ ప్రత్యర్థుల మీద జరుగుతున్న కుట్రపూరిత దాడులను తిప్పికొట్టాలి’ అని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.