హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ)/డోర్నకల్ : మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం భద్రతను కుదించడంపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. ఎలాంటి అధికారిక హోదా లేని సీఎం సోదరులకు భారీ భద్రత, వాహనాలు కల్పిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న రేవంత్ సర్కార్.. ప్రాణహాని హెచ్చరికలు ఎదుర్కొంటున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కు సెక్యూరిటీ తగ్గించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై నిరంతరం ప్రశ్నించే గొంతుకలపై కక్షసాధించడం తగదని మండిపడ్డారు. కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో ‘యాంటీ నక్సలిజం’ కార్యక్రమం ద్వారా ఎంతోమందిని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చారని.. కడప, కర్నూలు, చిత్తూరు లాంటి ఫ్యాక్షనిస్టులున్న ప్రాంతాలకు ఎస్పీగా పనిచేసి వ్యక్తికి ఏ ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా భద్రత తొలగించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ దేశ, రాష్ట్ర రక్షణ కోసం ఎన్నో సేవలు చేశారని.. గురుకులాల సెక్రటరీగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని, ఆయన భద్రతను తగ్గించే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని యథావిధిగా భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు.
మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ భద్రతను ప్రభుత్వం కుదించడంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను అణచివేయడానికి చూస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై నిరంతరం గొంతు విప్పుతున్నందుకే సెక్యూరిటీని తగ్గించారని ఆరోపించారు. విపక్షాల గొంతు నొకేందుకే రేవంత్ సర్కార్ కక్షసాధిస్తున్నదని విమర్శించారు. ఎలాంటి అధికారిక పదవులు లేని ముఖ్యమంత్రి సోదరులు, అనుచరులకు ప్రజాధనంతో భారీగా ప్రభుత్వ భద్రతను, ప్రొటోకాల్ వాహనాలను కల్పిస్తున్నారని మండిపడ్డారు. కానీ, దశాబ్దాల పాటు సమాజానికి సేవలందించి, ప్రస్తుతం ప్రాణహాని ఎదురొంటున్న మాజీ పోలీసు ఉన్నతాధికారికి భద్రత తగ్గించడం ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనకి తీసుకొని పాత భద్రతను, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తక్షణమే పునరుద్ధరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ భద్రతను కుదించడం పూర్తిగా ప్రభుత్వ కక్షసాధింపు చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వ కుంభకోణాలు, అవినీతిపై నిర్విరామంగా పోరాటం చేస్తున్నందుకే రాజకీయ కక్షతో రేవంత్‌రెడ్డి సరార్ ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 26 ఏండ్ల పాటు దేశానికి, సమాజానికి సేవలందించిన ఒక ఉన్నతాధికారి పట్ల ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంబించడం.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని విమర్శించారు. ఎలాంటి అధికారిక హోదా లేని సీఎం సోదరులకు భారీ భద్రత, వాహనాలు కల్పిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం,ప్రాణహాని హెచ్చరికలు ఎదురొంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత తగ్గించడం అత్యంత అన్యాయమని పేరొన్నారు. ఈ రకమైన బెదిరింపులతో ఆయన ఆత్మసె్థైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని తగ్గించలేరని.. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రులకు భద్రత కల్పిం చే గన్మెన్లను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ విమర్శించా రు. శనివారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్లకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇదివరకు మాజీ మంత్రులకు 2ప్లస్2 గన్మెన్లు ఇచ్చేవారని గుర్తుచేశారు. తనకు వన్ ప్లస్ వన్ చాలు అని చెప్పానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తనకు ఇష్టమైన వారికి మాత్రమే గన్మెన్లు ఉంచుతున్నదని, మాజీ మంత్రులకు తొలగిస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న తాను ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని, ఎస్టీ మహిళనైన తనకు గన్మెన్లు అవసరమని సత్యవతి తెలిపారు. మాజీ మంత్రుల భద్రత దృష్ట్యా గన్మెన్లను తొలగించొద్దని ఇంటెలిజెన్స్ ఐజీ కమలాసన్‌రెడ్డికి ఫోన్లో చెప్పినట్లు ఆమె చెప్పారు.