దామెర, మే 18: వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని పట్టభద్రులు ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపించాలని నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. శనివారం హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలోని ఏఎన్ఆర్ గార్డెన్స్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలపై పరకాల నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు.
ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు నెలల కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గురించి చెప్పనక్కరలేదని, ఆయన బాగోతం అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించిందని గుర్తుచేశారు. నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. ఈ సమావేశానికి స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అధ్యక్షత వహించారు.