ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న కేటీఆర్ గొంతునొక్కేందుకే రేవంత్ సర్కారు అక్రమ కేసులు బనాయిస్తున్నది. మాట్లాడితే కేసు.. శ్వాస తీసుకుంటే కేసు.. తెలంగాణభవన్‌కు నడిచివస్తే కేసు.. ఘోష్ కమిషన్ విచారణ గురించి బయట మాట్లాడితే కేసు.. ఇట్లా 14 కేసులు పెట్టింది. -ఆర్ఎస్ ప్రవీణ్
హైదరాబాద్ జూన్ 15 (నమస్తే తెలంగాణ): అటు లగచర్ల లంబాడా ఆడబిడ్డల నుంచి ఇటు మూసీ బాధితుల దాకా అన్యాయానికి గురైన వారందరి తరఫున ప్రశ్నించినందుకు కేటీఆర్‌పై రేవంత్ సర్కారు 14 అక్రమ కేసులు బనాయించిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాపాలన ముసుగులో రేవంత్‌రెడ్డి ప్రతీకార పాలన సాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని, ఆరు గ్యారెంటీలను అటకెక్కించి అణచివేతలు, కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యా లే విధానాలుగా మార్చుకొని ఓట్లేసిన ప్రజలను వంచిస్తున్నారని దుయ్యబట్టారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు కిశోర్‌గౌడ్, ఉపేంద్రాచారితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరంతరం ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న కేటీఆర్ గొంతునొక్కేందుకే రేవంత్ సర్కారు అక్రమ కేసులు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కేటీఆర్‌పై పోలీసులు ఒకే ఆంశంపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం విడ్డూరంగా ఉన్నది. ఇలా ఎక్కడైనా జరుగుతుందా? ఏ రూల్ బుక్‌లో ఉన్నది?’ అని ప్రశ్నించారు. ‘అయినా లంకె బిందెల కోసం వచ్చిన వ్యక్తి.. ప్రజలు మన చేతిలో మోసపోయేందుకు సిద్ధంగా ఉన్నరు అని చెప్పిన వ్యక్తి పాలనలో ఇంతకుమించిన ఘనకార్యాలు ఏం జరుగుతాయి?’ అని ఎద్దేవా చేశారు.
ఫార్ములా-ఈ ఓ చెత్త కేసు
‘ఫార్ములా ఈ- రేస్‌తో కేటీఆర్‌కు వ్యక్తిగతంగా ఒరిగిందేమీలేదు.. సర్కారుకు చెందిన నయాపైసా ఆయన ఖాతాలో జమకాలేదు.. సంబంధి త కంపెనీకే అందాయి.. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు.. అయినా సర్కారు అత్యుత్సాహంతో కేసు బనాయించింది.. నా 26 ఏండ్ల సర్వీసులో ఇలాంటి చెత్త కేసును ఏనాడూ చూడలేదు’ అని ఆర్ఎస్పీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కార్ రేసుతో హైదరాబాద్ కిర్తీ పెరిగిందని, అమరరాజా లాంటి దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయని గుర్తుచేశారు. టెన్త్ ఈవెంట్ నిర్వహిస్తే రాష్ర్టానికి ప్రయోజనం చేకూరేదని చెప్పారు. కానీ కేటీఆర్‌పై కక్షతో రేవం త్ ఫార్ములా ఈని రద్దు చేశారని విమర్శించారు.
కేటీఆర్ ధైర్యంగా ఒప్పుకొన్నారు
కర్ణాటకలో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ తొక్కిసలాట ఘటనలో అక్కడి సిద్ధిరామయ్య సర్కారు సీపీ, తొమ్మిది మంది పోలీసులను బలిపశువులను చేసిందని విమర్శించారు. పర్మిషన్ ఇచ్చిన వారు తప్పించుకొని పోలీసులపై నెపంవేశారని, అక్కడైనా ఇక్కడైనా కాంగ్రెస్‌ది ఒకటే విధానమని దెప్పిపొడిచారు. కానీ కేటీఆర్ ఫార్ములా ఈ -రేసు కంపెనీకి డబ్బు పంపించే విషయంలో అధికారులపై నెపం నెట్టలేదని, తన ఆదేశాలతోనే వారు చేశారని ధైర్యంగా చెప్పారని గుర్తుచేశారు.
రేవంత్‌కో న్యాయం… ఇతరులకు ఇంకో న్యాయమా?
కాంగ్రెస్ సర్కారు ప్రజాస్వామ్యాన్ని తుంగ లో తొక్కుతున్నదని ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తా రు. సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తులను సైతం వదిలిపెట్టడంలేదని విమర్శించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులైన కొణతం దిలీప్‌పై 27, క్రిశాంక్‌పై 23 అక్రమ కేసులు బనాయించిందని చెప్పారు. కానీ తాను ఫార్ములా-ఈ రద్దుతో రూ.700 కోట్ల నష్టం జరిగిందని, బాధ్యుడైన సీఎం రేవంత్‌పై నార్సింగ్ ఠాణాలో అన్ని ఆధారాలతో చేసిన ఫిర్యాదుకు అతీగతిలేకుండా పోయిందని, బా ధ్యుడిని అడగకుండానే అక్కడి పోలీసులు కేసు క్లోజ్ చేశారని తెలిపారు. ‘అంటే ముఖ్యమంత్రికో న్యాయం.. సామాన్యులకు మరో న్యాయ మా? ఇదేం ప్రజాస్వామ్యం’ అని ప్రశ్నించారు. సీఎం సొంతూరైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పం చ్ సాయిరెడ్డి సూసైడ్ లెటర్ రాసి రేవంత్ బ్రద ర్స్ బాధలు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నారని, కానీ పోలీసులు ఫోరెన్సిక్ నివేదిక రాకముందే కేసును మూసివేశారని మండిపడ్డారు.
అందాల పోటీలతో తలవంపులు..
కాంగ్రెస్ సర్కారు అందాల పోటీల పేరుతో రూ. 200 కోట్లు దుబారా చేసి రాష్ర్టానికి తలవంపులు తెచ్చిందని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలులోనే కాదు.. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణలోనూ విఫలమయ్యారని దుయ్యబట్టారు. పోటీల్లో పాల్గొన్న మిస్ ఇంగ్లాండ్ మిలా ్లమ్యాగిని అధికార పార్టీ నాయకులు వేధింపులకు గురిచేసి రాష్ర్టానికి తలవంపులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కానీ సంస్కారమున్న వ్యక్తిగా కేటీఆర్ మాత్రం తెలంగాణ ప్రజల తరఫున మిల్లా మ్యాగీకి క్షమాపణలు చెప్పారని గుర్తుచేశారు.
నోటీసులను ఉపసంహరించుకోవాలి
ఫార్ములా ఈ వ్యవహారంలో కేటీఆర్ చట్టాన్ని ఉల్లంఘించలేదని ఆర్ఎస్పీ పునరుద్ఘాటించా రు. ఏ తప్పూ చేయలేదు కాబట్టే ఆయన లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమని ప్రకటించారని గుర్తుచేశా రు. అసెంబ్లీలో సైతం చర్చించాలని సవాల్ విసిరారని చెప్పారు. కానీ సర్కారు బట్టకాల్చి మీద వేసేందుకు కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే కేటీఆర్‌కు ఇచ్చిన ఏసీబీ నోటీసులను ఉపసంహరించుకోవాలని, అక్రమ కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు.