హైదరాబాద్, జూన్ 29 (నమస్తేతెలంగాణ):‘కాంగ్రెస్ సర్కారు డెయిలీ సీరియల్లా ఫోన్ ట్యాపింగ్ విచారణను సాగదీస్తున్నది. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే అనుకూల మీడియాకు తప్పుడు లీకులిస్తూ డ్రామాలు ఆడుతున్నది. రాష్ట్ర సాధన కోసం తెగించి పోరాడి, పదేండ్లు మంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో తెలంగాణ అభ్యున్నతి కోసం పరితపిస్తున్న కేటీఆర్‌పై దుష్ప్రచారానికి ఒడిగడుతున్నది. కొన్ని మీడియా చానళ్లు, సోషల్ మీడియా సైట్లతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ రాక్షసానందం పొందుతున్నది’ అని ఐపీఎస్ మాజీ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నిప్పులు చెరిగారు. సీఎం డైరెక్షన్లో పార్టీ పెద్దల కనుసన్నల్లో గాంధీభవన్ నుంచే ఈ వ్యవహారం నడుస్తున్నదని విమర్శించారు. ‘రహస్యంగా సాగాల్సిన విచారణ ప్రతీకారంతో రగిలిపోతున్న రేవంత్‌రెడ్డి వైఖరితో తప్పుదారి పడుతున్నది. బీజేపీతో కలిసి ఆయన ఆడుతున్న నాటకంతో దేశ, రాష్ట్ర అంతర్గత భద్రతకు ప్రమాదం పొంచి ఉన్నది’ అని ఆందోళన వ్యక్తంచేశారు. 89 కేసులున్న నేర చరిత్ర కలిగిన వ్యక్తి సీఎంగా, హోంమంత్రిగా ఉంటే ఇంతకు మించిన పాలనను ఆశించలేమని దెప్పిపొడిచారు. డిస్ట్రక్షన్, డిసెప్షన్, డైవర్షన్ రాజకీయాలతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మహిళా నేత దాసరి ఉష, నేతలు బొమ్మెర రామ్మూర్తి, అభిలాష్, సైదులుతో ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు దుర్మార్గపు పోకడలతో తెలంగాణ సమాజం కోపంతో రగలిపోతున్నదని, ఇందుకు కొన్ని మీడియా సంస్థలు ఆజ్యం పోస్తున్నాయని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లోనే మహాన్యూస్ చానల్‌పై దాడి జరిగిందని, ఈ దురదృష్టకర ఘటనపై చింతిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబంపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన చానల్‌పై కేసులు పెట్టకుండా ఉపేక్షించిన సైబర్ క్రైమ్ పోలీసులు, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.
సిట్‌ను నడుపుతున్నది కమిషనరా? కాంగ్రెస్సోళ్లా?
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమైందని ఆర్ఎస్పీ తెలిపారు. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి వెతికి వేటాడి పట్టుకున్నారని గుర్తుచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నదని అప్పటి కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదంతాన్ని గుర్తుచేశారు. అయినా ఇప్పుడు రేవంత్‌రెడ్డి తన సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని గుండెపై చెయ్యేసి చెప్పాలని నిలదీశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతితో నేరస్తుల ఫోన్లను ట్యాప్ చేయడం సర్వసాధారణమని చెప్పారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి దీనిని భూతద్దంలో చూపుతూ కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేస్తున్నారని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే తప్పుచేసిన వారిని శిక్షించాలని, కానీ నిత్యం విచారణ అంశాలపై మీడియాకు లీకులిస్తూ ఎంక్వైరీని ప్రహసనంగా మార్చారని దుయ్యబట్టారు. అసలు విచారణ తీరును చూస్తుంటే సిట్‌ను నడుపుతున్నది పోలీసు అధికారులా? లేక పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడా? కాంగ్రెస్ నాయకులా? అర్థం కావడంలేదని ఎద్దేవాచేశారు.
బీజేపీ, కాంగ్రెస్ కూడబలుక్కొని ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కొని బీఆర్ఎస్పై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నాయని ప్రవీణ్‌కుమార్ ఆక్షేపించారు. ‘చివరికి సెల్‌ఫోన్‌ను అడ్డంపెట్టుకొని టెన్త్ పేపర్లు లీక్ చేసిన ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్..పేదల భూములు కబ్జా చేసిన ఎంపీ రఘునందన్‌రావు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడటం..మరో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనను పిలువాలని సిట్‌ను కోరడం సిగ్గుచేటు’ అని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కాంగ్రెస్ ఎంగిలి మెతుకులకు ఆశపడి ఉద్యమపార్టీని ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు.
అప్పుడు అవార్డులు.. ఇప్పుడు విమర్శలా?
ఫోన్ ట్యాపింగ్‌పై ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావుకు ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉన్నదని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. ఆయన 16 ఏండ్లు టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో పనిచేశారని చెప్పారు. ‘ప్రభాకర్‌రావును అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తమ పురస్కారంతో సత్కరించారు. రాష్ట్రపతి మెడల్ అందుకున్నారు. 2019లో కేంద్ర హోమంత్రి అమిత్‌షా పురస్కారమిచ్చారు? మరి ఆయన కరెక్టా? లేక ప్రభాకర్‌రావుపై ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ కరెక్టా?’ అని ప్రశ్నించారు.
దుర్మార్గుడిగా చిత్రీకరించడం దుర్మార్గం
క్యాన్సర్‌తో బాధపడుతూ సిట్ విచారణకు సహకరిస్తానని చెప్తున్న ప్రభాకర్‌రావును ప్రభుత్వం, కాళోజీ లాంటి కొన్ని యూట్యూబ్ చానళ్లు దుర్మార్గుడిగా చిత్రీకరించడం దుర్మార్గమని ఆర్ఎస్పీ మండిపడ్డారు. మిడిమిడి జ్ఞానంతో రిపోర్టర్లుగా వ్యవహరిస్తున్న కొందరు ప్రభాకర్ రావును కాల్చిపారేసినా తప్పులేదని వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇంతకంటే దారుణం మరోటి లేదని ఫైర్ అయ్యారు. ప్రజల భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టిన అధికారిని మానసిక క్షోభకు గురిచేయడం బాధాకరమని వాపోయారు. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఖాసీం రజ్వీ, నయా రజాకార్ అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. సిట్, సర్కారు, మీడియా అనుచిత పోకడలతో ప్రభాకర్‌రావు కుటుంబం తీవ్ర మనోవేదనను ఎదుర్కొంటుందని చెప్పారు. ఇంత జరుగుతున్నా ప్రశ్నించాల్సిన పోలీసు అధికారుల సంఘం నాయకులు ఎందుకు పెదవులు మూసుకున్నారో చెప్పాలని నిలదీశారు. విచారణ పేరిట ఒత్తిడి తేవడంతో పంజాబ్‌లో అనేక మంది అధికారులు ఆత్మహత్య చేసుకున్నారని, రేవంత్‌రెడ్డి తెలంగాణను పంజాబ్‌లా మార్చవద్దని హితవు పలికారు.
నాడు కన్నీళ్లు పెట్టుకున్న ‘బాబు’కు మహా న్యూస్ చేసిన పని కరెక్ట్ అనిపిస్తున్నదా?
వైసీపీ నేతలు అసెంబ్లీలో తన సతీమణిని దూషించారని కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు.. మరి అలాంటి పనే చేసిన మహాన్యూస్ను సమర్థించడం సిగ్గుచేటని ప్రవీణ్‌కుమార్ నిప్పులు చెరిగారు. ‘నాడు తన వ్యక్తిత్వ హనానానికి పాల్పడుతున్నారని వైసీపీ నాయకులపై దుమ్మెత్తిపోసిన బాబుకు, ఇప్పుడు కేటీఆర్‌పై మహాన్యూస్ చానల్ చేసిన వ్యక్తిత్వ హననం కనిపించలేదా?’ అని నిలదీశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కూడా వాస్తవాలు తెలుసుకోకుండా చానల్‌పై దాడి జరిగిందని మాట్లాడటం దురదృష్టకరమని, బనకచర్ల విషయంలో బాబు పన్నాగాలను బీఆర్ఎస్ బయటపెట్టినందునే కక్ష సాధిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ పరిణామాలను, ఆంధ్రా నాయకుల పెత్తనాన్ని చూసి సగటు తెలంగాణవాదులు ఆందోళనకు గురవుతున్నారని వాపోయారు. ఇకనైనా రేవంత్ పాలనపై దృష్టిపెట్టి గురుకులాల్లో పిల్లల మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని హితవుపలికారు. బీఆర్ఎస్ను బద్నాం చేయాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు.