హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుట్రతో బాలిక భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, ఇద్దరు అగ్రనేతల నాటకంతో బాధిత కుటుంబం విలవిలలాడుతున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌కు తాత్కాలిక బెయిల్ వెనుక ముఖ్యమంత్రి పరోక్ష హస్తం ఉన్నదని సంచలన ఆరోపణలు చేశారు. కోర్టు విచారణ సమయంలో నిందితుడి నేరచరిత్రపై ప్రశ్నించకుండా ఉద్దేశ పూర్వకంగా దాచిపెట్టిన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘సింగరేణి కేసులో బాల్క సుమన్‌కు బెయిల్ రాకుండా ప్రత్యేక జీవో తెచ్చి..స్పెషల్ పీపీని పెట్టిన ప్రభుత్వం.. అదే పని బండి భగీరథ్ కేసులో ఎందుకు చేయలేదు? అంటే కేంద్రమంత్రి పుత్రుడికి ఒక న్యాయం..అక్రమాలను ప్రశ్నించిన సుమన్‌కు మరో న్యాయమా?’ అని ప్రశ్నించారు. భగీరథ్ బెయిల్‌కు సంబంధించిన ఆర్డర్ కాపీని బాధితురాలికి ఎందుకివ్వలేదని నిలదీశారు. ఇదీ ముమ్మాటికీ న్యాయసూత్రాలకు విరుద్ధమని స్పష్టంచేశారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ భగీరథ్ బెయిల్ వెనుక ఉన్న రహస్యాలను బయటపెట్టారు.
భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు చేసి నెలన్నర దాటినా చార్జ్‌షీట్ ఎందుకు వేయలేదని పోలీసులను ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. సంగప్పను, బండిని అరెస్ట్ చేయాల్సి వస్తుందనే ఆలస్యం చేస్తున్నారని అనుమానం వ్యక్తంచేశారు. చీటికిమాటికి సిట్ అంటూ బెదిరింపులకు దిగే హోంమంత్రి రేవంత్‌రెడ్డి భగీరథ్ ఉదంతంపై ఎందుకు వేయలేదని నిలదీశారు. కేసీఆర్ పాలనలో షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసి సఖీ, భరోసా కేంద్రాలు పెట్టి మహిళలపై అఘాయిత్యాల నిరోధానికి చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. గతంలో జరిగిన లైంగికదాడి ఘటనలపై కేసీఆర్ ఏనాడూ కాంప్రమైజ్ కాలేదని స్పష్టంచేశారు.
చర్లపల్లి జైలులో కూడా అంబేద్కర్ సెంటర్ ఉన్నది. భగీరథ్ కోసం అక్కడే పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయవచ్చు. ఒకవేళ కాదంటే కోర్టు అనుమతి తీసుకొని పరీక్ష ఉన్న రోజు కేంద్రానికి తీసుకెళ్లి సాయంత్రం తిరిగి జైలుకు తీసుకురావచ్చు. కానీ భగీరథ్ కేసులో ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఎందుకో మరి! జూన్ 20న స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు ముగిసినయ్. కానీ, భగీరథ్ కోసం జూన్ 22 నుంచి 26 వరకు మరోసారి స్పెషల్ సప్లిమెంటరీ పెట్టడంలో ఆంతర్యమేంది?
– ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
కానీ భగీరథ్ పోక్సో కేసులో బాలిక నాలుగుసార్లు లైంగికదాడికి గురైందని చెప్పారు. నిందితుడు కేంద్రమంత్రి కొడుకు అయినందునే మొదటి నుంచీ సీఎం రేవంత్ అతడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధితురాలిపై అక్రమంగా హనీట్రాప్ కేసు పెట్టించి నిందితురాలిగా చూపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. గత మే8న కేసు నమోదైనప్పటి నుంచి జైలుకెళ్లకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చూస్తే బీఆర్ఎస్ పసిగట్టి ప్రతిఘటించిందని స్పష్టంచేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో సెక్షన్ 6 చేర్చారని చెప్పారు. రేవంత్‌రెడ్డి నిస్సహాయస్థితిలో భగీరథ్‌ను అప్పగించాలని బండిని ప్రాధేయపడ్డారని ప్రస్తావించారు. ప్రజలు, బీఆర్ఎస్ పోరాటంతో దిగివచ్చి అరెస్ట్, లొంగుబాటు పేరిట డ్రామాలు నడిపి చివరికి జైలుకు పంపారని దెప్పిపొడిచారు.
భగీరథ్ 2023 నుంచి 2026 వరకు మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్నాడని, గతంలో తోటి విద్యార్థులపై దాడి చేస్తే అతడిని సస్పెండ్ చేశారని ఆర్ఎస్పీ గుర్తుచేశారు. మూడేండ్ల కోర్సులో పరీక్షలు రాయకుంటే జీవితం ఆగమవుతుందని బెయిల్ ఇవ్వడం బాధాకరమని, వాస్తవానికి చర్లపల్లి జైలులో కూడా అంబేద్కర్ సెంటర్ ఉన్నదని, భగీరథ్ కోసం అక్కడే పరీక్ష రాసేందుకు ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. ఒకవేళ కాదంటే కోర్టు అనుమతి తీసుకొని పరీక్ష ఉన్న రోజు కేంద్రానికి తీసుకెళ్లి సాయంత్రం తిరిగి జైలుకు తీసుకురావచ్చని తెలిపారు. భగీరథ్ కేసులో ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఎందుకో అర్థంకావడం లేదని వాపోయారు. జూన్ 20న స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు ముగిశాయని చెప్పారు. కానీ భగీరథ్ కోసం జూన్ 22 నుంచి 26 వరకు మరోసారి స్పెషల్ సప్లిమెంటరీ పెట్టడంలోని ఆంతర్యమేందని ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్‌లోని మూడో పేరాలో మరో పది రోజుల తర్వాత వైవా ఉంటుందని చెప్పడం వెనుక బెయిల్ పొడిగించే ఉద్దేశం స్పష్టంగా కనబడుతున్నదని చెప్పారు. పీపీ ఉద్దేశపూర్వకంగానే నిందితుడి నేర ప్రవృత్తి, చరిత్రను దాచిపెట్టారని ఆరోపించారు. పీపీపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోర్టుకు వెళ్తుందని స్పష్టంచేశారు. బాలికకు న్యాయం జరిగేదాకా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
బండిని ఎందుకు సస్పెండ్ చేయడం లేదు? కేంద్ర మంత్రి కొడుకుపై పోక్సో కేసు నమోదైనా బండి సంజయ్‌ని వెనుకేసుకురావడంలోని ఆంతర్యమేందని బీజేపీ అధిష్ఠానాన్ని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. గతంలో ఆ పార్టీ ఎంపీ బంగారు లక్ష్మణ్ రూ. లక్ష లంచం తీసుకొని దొరికితే వేటు వేశారని గుర్తుచేశారు. కానీ సంజయ్ విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కొడుకుపై పోక్సో కేసు నమోదైనా బండి సంజయ్‌ని బీజేపీ వెనుకేసుకురావడంలో ఆంతర్యమేంది? గతంలో ఆ పార్టీ ఎంపీ బంగారు లక్ష్మణ్ లక్ష రూపాయల లంచం తీసుకొని దొరికితే వేటు వేసిండ్రు. మరి సంజయ్ విషయంలో ఎందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నరు?
భగీరథ్ పోక్సో కేసులో కేంద్ర మంత్రి సంజయ్, ఆ పార్టీ నేత సంగప్పకు సమానపాత్ర ఉన్నదని ఆర్ఎస్పీ ఆరోపించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో వారిద్దరి పేర్లూ ఉన్నాయని గుర్తుచేశారు. బండి సంజయ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులెందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గతంలో బాధితులను బెదిరించేందుకు యత్నించారని గుర్తుచేశారు. మేడ్చల్ కోర్టులో 3 సార్లు బెయిల్ దరఖాస్తును తిరస్కరించారని, కానీ పోలీసులు ఈ విషయం బాధితురాలికి చెప్పకపోవడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ‘పోక్సో యాక్ట్ 2020 ప్రకారం సెక్షన్ 4, క్లాజ్ 2 (ఎఫ్) ప్రకారం కేసు పురోగతిని బాధితులకు చెప్పాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాధితురాలి స్టేట్మెంట్ తీసుకోవాలి, నిందితుడి కన్విన్షన్ గురించి తెలియజేయాలి.. విచారణ అధికారి బిజీగా ఉంటే మహిళా పోలీసు అధికారినైనా పంపించి సమాచారం ఇవ్వాలి..193 బీఎన్ఎస్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది’అని వెల్లడించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వగా ఫార్చునర్ కారులో వెళ్లిపోయాడని చెప్పారు.