హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అరాచక పాలన, దుశ్శాసన పర్వం నడుస్తున్నదని, తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అంతమొందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. పోలీసుల నీడలో ప్రతిపక్ష నేత కేసీఆర్ నివాసంపైకి కాంగ్రెస్ గూండాలను పురమాయించారని అన్నారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, అనిల్‌కుమార్‌రెడ్డి వంటి నేరచరిత్ర ఉన్న నాయకులకు పోలీసులే ఎసార్ట్ ఇచ్చి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంవైపు పంపించారని, అదే సమయంలో అకడికి వెళ్తున్న బీఆర్ఎస్ శ్రేణులను మాత్రం అక్రమంగా అరెస్టు చేశారని చెప్పారు. కేసీఆర్ ఉద్యమం చేయకపోతే వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే అయ్యేవాడా, రేవంత్‌రెడ్డి సీఎం అయ్యి రూ.200 కోట్ల ఇల్లు కట్టుకునేవాడా అని నిలదీశారు. దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డిని జుట్టు పట్టుకొని గొంతు పిసికేలా వ్యవహరించారని, మహిళలపై జరిగిన ఈ అఘాయిత్యాన్ని చూసి ఆవేశంలో మాట జారినా, తాతా మధు క్షమాపణ చెప్పి విచారం వ్యక్తంచేశారని గుర్తుచేశారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రతిభ, పరిపాలనా దక్షతను గుర్తించకుండా ‘దళిత స్పీకర్.. దళిత స్పీకర్’ అంటూ కాంగ్రెస్ మంత్రులే పదేపదే అవమానిస్తున్నారని ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. సాటి మహిళా ప్రజాప్రతినిధులపై పురుష పోలీసులు దాడి చేస్తే కనీసం పరామర్శించకుండా, వారు కన్నీళ్లు పెట్టుకుంటే డ్రామాలు, నాటకాలు అంటూ మంత్రి సీతక మాట్లాడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. కర్ల రాజేశ్ లాకప్‌డెత్, ఆదివాసీ యువతి శిరీషపై లైంగికదాడి-హత్య, ఎర్ర రాజశేఖర్ హత్యల సమయంలో లేవని నోర్ల్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. కేసీఆర్ అమలుచేసిన ఎన్నో చరిత్రాత్మక సంక్షేమ పథకాలను అటకెకించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, గిరిజనుల భూములను 22ఏ కింద చేర్చి మోసం చేసిందని దుయ్యబట్టారు.
ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్‌రెడ్డిని ఉదయాన్నే అక్రమంగా నిర్బంధించి జైలుకు పంపాలని చూస్తే న్యాయస్థానం ఆ అరెస్టులను తప్పుపట్టి రిమాండ్‌ను తిరసరించిందని, దీంతో కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు అని ప్రవీణ్‌కుమార్ పేరొన్నారు. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ కేసీఆర్ చావు కోరిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజు యాదవ్, జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ బైండ్ల విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే పోలీస్ ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిని సడలించాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో అభ్యర్థులతో కలిసి ఆయన మాట్లాడుతూ.. జీవో 87 కింద ఎలాంటి సడలింపు లేకుండా ఏడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల సుమారు రెండు లక్షల మంది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ వైఫల్యానికి అభ్యర్థులను బలిచేయడం తగదని, తాము పరీక్షలు లేదా ఫిజికల్ ఈవెంట్లలో ఎలాంటి రాయితీలు కోరడం లేదని స్పష్టం చేస్తూ.. కానిస్టేబుల్ అభ్యర్థులకు 36 ఏండ్లు, ఎస్సై అభ్యర్థులకు 38 ఏండ్ల వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించేలా రేవంత్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేయాలని కోరారు.